ఉత్తర్‌ప్రదేశ్‌లో సోన్‌భద్ర జిల్లాలో ఓ కుటుంబం.. పబ్లిక్ టాయిలెట్లో నివసిస్తున్న దృశ్యాలు కలచి చేస్తున్నాయి. తాము నివసించే గుడిసెపై చెట్టు కూలగా వారికి ఈ దుస్థితి తలెత్తింది.
అసలేమైంది?
సోన్‌భద్ర జిల్లా చోపన్ నగర్లో రాజేంద్ర నిషాద్ అనే ఓ దివ్యాంగుడు తాపీ మేస్త్రీగా చేస్తున్నాడు. తన భార్య సహా ఆరుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులతో ఓ గుడిసెలో నివసించేవాడు. అయితే ఇటీవల కురిసిన వర్షాల ధాటికి.. ఓ పెద్ద వేప చెట్టు వారి గుడిసెపై కూలింది. దాంతో ఉన్న గుడిసె కాస్తా కుప్పకూలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాహాని కలగలేదు. కానీ, నిరాశ్రయులుగా మారిన కుటుంబ సభ్యులు.. సమీపంలోని ఓ పబ్లిక్ టాయిలెట్‌ను నమ్ముకున్నారు. అప్పటి నుంచి అక్కడే నివసిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.
పదిహేనేళ్లుగా తాము గుడిసెలోని నివసిస్తున్నామని రాజేంద్ర నిషాద్ భార్య.. 'ఈటీవీ భారత్'తో తెలిపారు. తమకు పీఎం ఆవాస్ యోజన కింద ఓ ఇల్లు మంజూరు చేసినట్టు నగర పంచాయతీ అధికారులు చెప్పినా... ఇంకా పైకప్పు నిర్మాణానికి నిధులను అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.