ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో దారుణం జరిగింది. గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం చెందారు. పఖంజుర్ పరిధిలోని ఇర్పానర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. దీంతో దంపతులు సహా ముగ్గురు కుమార్తెలు విగతజీవులయ్యారు. మృతులంతా ఇంట్లో నిద్రిస్తుండగా.. వర్షానికి గోడ కూలి వారిపై పడిందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. తాజాగా కురిసిన భారీ వర్షాలకు రోడ్డు కొట్టుకుపోవడం వల్ల పడవ సహాయంతో అధికారులు గ్రామానికి వెళ్లారు.
కాంకేర్ జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. దీంతో నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు రోడ్డు మార్గాలు తెగిపోయాయి.
భక్తులపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి:పాదయాత్రగా దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులపైకి ఓ ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం రాజస్థాన్లోని పాలి జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.