Falaknuma Express Fire Accident News :పశ్చిమ బెంగాల్‌లోని హావ్ డా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో యాదాద్రి భువనగిరి జిల్లా పగిడిపల్లి-బొమ్మాయిపల్లి వద్ద అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. వెంటనే ఈ విషయాన్ని గమనించిన రైల్వే సిబ్బంది రైలును నిలిపివేసి ప్రయాణికులను దించేశారు. ఈ ఘటనలో రైలులోని ఐదు బోగీలు పూర్తిగా కాలిపోయాయి. అయితే అదే సమయంలో ఆ రైలులో ఉన్న ఓ యువకుడు మాత్రం తన ప్రాణాలను లెక్కచేయకుండా పలువురి ప్రాణాలు కాపాడాడు. ప్రమాదాన్ని ముందే పసిగట్టి రైలు చైను లాగి.. ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. ఎంతో మంది ప్రాణాలను నిలిపాడు సిగిల్ల రాజు. పాతపట్నం సమీపంలోని చిన్న మల్లెపురానికి చెందిన రాజు ఐడీఏ బొల్లారం పుర పరిధి లక్ష్మీనగర్‌లో కుటుంబీకులతో పదేళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన ఈ విధంగా వివరించారు.
Shocking Facts about Falaknuma Express Accident :'ఒడిశాలోని పర్లాకిమిడికి అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లి తిరుగు ప్రయాణంలో పలాసలో రైలు ఎక్కాం. నేను, మా అమ్మ పార్వతి, చెల్లి పావని, పెద్దమ్మ బృందావతితో కలిసి ఎస్4 బోగిలో కూర్చున్నాం. ఉదయం 11 గంటల సమయంలో నేను పై బెర్తులో పడుకొని ఉండగా రబ్బరు కాలినట్లు వాసన వచ్చింది. పై నుంచి వేడి వస్తుంది. ఎండకు ఉండొచ్చని భావిస్తున్న సమయంలోనే వాసన మరింత ఎక్కువైంది. కిందికి దిగి కిటికీలోంచి చూడగా పొగ వస్తోంది. వెంటనే కేకలు వేశాను. చైన్ లాగినా రైలు పరిగెడుతూనే ఉంది. రెండోసారి గట్టిగా లాగితే రైలు ఆగింది' అని రాజు తెలిపాడు.