Jo Joseph fake porn case: కేరళ తిక్కకరా ఉపఎన్నికలో పోటీ చేస్తున్న ఎల్డీఎఫ్ అభ్యర్థి ఫేక్ పోర్న్ వీడియో కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎల్డీఎఫ్ తరఫున డాక్టర్ జో జోసెఫ్ తిక్కకరా ఉపఎన్నికలో బరిలో ఉన్నారు. ఇటీవల ఆయన పేరు మీద ఓ నకిలీ పోర్న్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో అప్లోడ్ చేసినట్లు భావిస్తున్న వ్యక్తిని తాజాగా తమిళనాడులో అదుపులోకి తీసుకున్నట్లు కేరళ పోలీసులు తెలిపారు. నిందితుడు ఎర్నాకుళంకు వెళ్తున్నట్లు వెల్లడించారు.
ఫేక్ పోర్న్ వీడియోపై కామెంట్లు చేసి, షేర్ చేసిన నలుగురు వ్యక్తులను ఇదివరకే పోలీసులు అరెస్టు చేశారు. వీరు ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. వీడియో అప్లోడ్ చేసిన వ్యక్తిని ప్రస్తుతం అరెస్టు చేయలేదని.. అదుపులోకి తీసుకున్నామని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. నిందితుడిని ప్రశ్నించి, ఫోన్ను పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.