అసెంబ్లీలోకి ఓ 'ఫేక్ ఎమ్మెల్యే' ప్రవేశించిన ఘటన బంగాల్లో కలకలం రేపింది. విధానసభ గేటు దాటి ప్రధాన భవనం వద్దకు చేరుకున్న ఆ ఫేక్ ఎమ్మెల్యేను భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. అనుమానం వచ్చిన సిబ్బంది అతడిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో అతడిని పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటన తర్వాత అసెంబ్లీ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే?..
బంగాల్లో అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా.. ఆ 'ఫేక్ ఎమ్మెల్యే' అసెంబ్లీ ప్రాంగణంలోకి గేట్ దాటి ప్రవేశించాడు. అనుమానం వచ్చిన సిబ్బంది అతడిని ప్రశ్నించగా.. సహకార శాఖ మంత్రి అరూప్రాయ్ స్థానంలో తాను అసెంబ్లీకి వచ్చానని చెప్పాడు. ఎక్కడి నుంచి వస్తున్నారని అడుగగా.. హరీష్ ఛటర్జీ స్ట్రీట్ నుంచి వచ్చానని తెలిపాడు. అతడి మాటల్లో పొంతన లేకపోవటం వల్ల చాలా సేపు విచారించి పోలీసులకు అప్పగించారు.