నకిలీ జీఎస్టీ బిల్లులు, పన్ను ఎగవేతలకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యల్లో భాగంగా దిల్లీకి చెందిన వ్యాపారవేత్త క్రిషన్ కుమార్‌ను అధికారులు గురువారం.. అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తన స్నేహితులు, ఉద్యోగుల సమాచారాన్ని వినియోగించి నకిలీ సంస్థలను సృష్టించాడని అధికారులు తెలిపారు.
డేటా అనాలటిక్స్, మెషీన్ లెర్నింగ్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ నేరాలను ఉత్తర దిల్లీ సీజీఎస్టీ విభాగానికి చెందిన జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. నిందితుడికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
"ప్రాథమిక దర్యాప్తు ప్రకారం నిందితుడు మొత్తం 5 నకిలీ సంస్థలను సృష్టించాడు. శ్రద్ధా ట్రేడర్స్, అన్షారా ఇంపెక్స్, విజేత ఎంటర్ప్రైజెస్, ఎస్ఎం ఏజెన్సీస్, దీపాషా సేల్స్ అనే బోగస్ కంపెనీలను నెలకొల్పాడు. వెన్న, నెయ్యి, నూనెలకు సంబంధించి నకిలీ జీఎస్టీ బిల్లులు తయారు చేసేందుకు ఈ సంస్థలను ఉపయోగించుకున్నాడు. ఉత్పత్తులను సరఫరా చేయకుండానే.. బిల్లులను చూపించి పన్ను ఎగవేతకు పాల్పడ్డాడు. సుమారు రూ. 94 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను అనుమతి లేకుండా బదిలీ చేసుకున్నాడు."
-కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు