గూగుల్ ఉపయోగిస్తూ పేషెంట్లకు వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్‌ను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు. ఇంటర్నెట్లో సంబంధింత వ్యాధికి ఏ మందులు రాసి ఇవ్వాలో తెలుసుకుని రోగులకు ప్రిస్క్రిప్షన్ రాస్తి ఇస్తున్నాడు నిందితుడు. తన పేరుతోనే ఉన్న ఓ వైద్యుడి స్థానంలో నకిలీ ధ్రువపత్రాలు సంపాదించాడు. చివరకు ఆ వైద్యుడి ఫిర్యాదుతో.. నిందితుడి బాగోతం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.
పోలీసుల వివరాల ప్రకారం..తంజావూరు జిల్లాకు చెందిన సెంబియన్(35) అనే వైద్యుడు.. దిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. 2013లో రష్యాలో మెడికల్ కోర్సు పూర్తి చేసిన అతడు.. తమిళనాడు మెడికల్ కౌన్సిల్లో వైద్యుడిగా నమోదు చేసుకున్నాడు. మెడికల్ రిజిస్ట్రేషన్ నంబర్ పొందిన తర్వాత.. ఇండియన్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నాడు. ఇటీవలే సెంబియన్.. ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మళ్లీ తమిళనాడులో స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు.
అందుకోసం గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్‌ను మెడికల్ కౌన్సిల్ వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేసేందుకు యత్నించాడు. ఎంత చేసినా అప్లోడ్ అవ్వలేదు. దీంతో తమిళనాడు మెడికల్ కార్యాలయానికి సెంబియన్ వెళ్లాడు. జరిగినదంతా వారికి చెప్పాడు. రాతపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. చెన్నై పోలీసు కమిషనర్ ఈ కేసును.. అన్నానగర్ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. అదే పేరుతో ఉన్న మరో వ్యక్తి.. అసలైన వైద్యుడి స్థానంలో నకిలీ పత్రాలు అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు.