Fake Currency Racket Maharashtra: ఏ విషయమైనా తెలియకపోతే యూట్యూబ్ చూసి నేర్చుకుంటాం. అలా చాలామంది వంటలు, ఇతరత్రా పనులు నేర్చుకుంటారు. కానీ మహారాష్ట్ర, ఔరంగబాద్‌కు చెందిన ఓ ఇంజినీర్ మాత్రం నకిలీ నోట్లను ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. అతనితోపాటు మరో నలుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏమైందంటే..?
ఔరంగబాద్‌లోని పుండలీక నగర్‌కు చెందిన సమ్రాన్(30) అలియాస్ లక్కీ.. యూట్యూబ్‌లో చూసి ఫేక్ నోట్లను తయారు చేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఓ గదిలో ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశాడు. దొంగ నోట్లు తయారు చేసి చిన్నచిన్న దుకాణాల్లో, బెల్టు షాపుల్లో చలామణి చేశాడు.
పోలీసులకు ఎలా తెలిసింది?
ఎవరో నకిలీ నోట్లు ఇచ్చి లిక్కర్ కొనుగోలు చేశారని పుండలీక నగర్‌లోని సూపర్ వైన్స్ షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఏఎస్ఐ శేష్రావ్ ఖటానే బృందం.. వైన్స్ షాపుపై నిఘా పెట్టింది. రంగనాథ్ ధవల్పుర్ అనే వ్యక్తి.. ఇదివరకే ఓసారి దొంగ నోట్ల చలామణి కేసులో అరెస్టు అయి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే.. వైన్స్ షాపు వద్ద రంగనాథ్‌ను చూసిన పోలీసులు.. అతడిని విచారించారు. దీంతో సమ్రాన్ అలియాస్ లక్కీ నిర్వహిస్తున్న దొంగ నోట్ల దందా బయటపడింది.
రంగనాథ్ ఇచ్చిన సమాచారం మేరకు.. పుండలీక నగర్‌లోని లక్కీ గదికి చేరుకున్న పోలీసులు.. కలర్ ప్రింటర్లను ధ్వంసం చేశారు. రూ. 1,20,000 నకిలీ కరెన్సీను స్వాధీనం చేసుకున్నారు. లక్కీను అరెస్ట్ చేశారు. అతడితోపాటు నితిన్ కల్యాణ్రావ్(25), అక్షయ్ అన్నాసాహెబ్ పదుల్(28), దాదారావ్ పట్రవ్ గవాండే(42), రంగనాథ్ ధవల్పుర్(49)ను అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి:ఆసుపత్రిలో ఫ్లోర్ తుడిచిన డాక్టర్.. వీడియో వైరల్