Fake Cricket League Gujarat: భారత్‌లో క్రికెట్‌కు ఉన్న క్రేజే వేరు. టీమ్ఇండియా క్రికెట్ ఆడుతుందంటే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా చూసేవాళ్లు కోట్లల్లో ఉంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైనప్పటి నుంచి ఈ క్రికెట్ పిచ్చి మరింత పెరిగింది. ఇదే అదనుగా పందెం రాయుళ్లు.. ఆన్‌లైన్ బెట్టింగ్తో క్రికెట్‌ను సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టు చప్పుడు కాకుండా సాగే ఈ దందాలో కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ఇప్పుడు ఈ వ్యసనం ముదిరి పాకానపడింది. క్రికెట్ మ్యాచ్‌లు జరగకుండానే.. బెట్టింగ్‌లతో బురిడీ కొట్టించే కేటుగాళ్ల సంఖ్య పెరిగింది. నకిలీ ఆన్‌లైన్ క్రికెట్ లీగ్స్ నిర్వహిస్తూ రెచ్చిపోతున్నారు. గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇలాంటి ఫేక్ టీ-20 క్రికెట్ లీగ్స్ నిర్వహిస్తున్న రెండు ముఠాలు అడ్డంగా పోలీసులకు చిక్కాయి.
గుజరాత్లో ఇలా.. నకిలీ క్రికెట్ లీగ్ నిర్వహిస్తూ రష్యన్లనే బురిడీ కొట్టించారు కొందరు కేటుగాళ్లు. నిజం మ్యాచ్‌ల తరహాలోనే ప్రత్యక్ష ప్రసారం, స్టేడియంలో అభిమానులు కేరింతలను సెటప్ చేసి, ప్రముఖ కామెంటేటర్ హర్ష బోగ్లేను మిమిక్రీ చేసే వ్యక్తిని సైతం నియమించుకున్నారు. ఈ వ్యవహారమంతా నడిపింది సైబర్ కేటుగాళ్లో, మోసాల్లో ఆరితేరినవారు కాదు.. గుజరాత్‌కు చెందిన చిన్న గ్రామానికి చెందిన యువకులు. లీగ్‌ను క్వార్టర్ ఫైనల్ వరకు తీసుకొచ్చారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి.
గ్రామ శివారుల్లోని కొంత భూమిని కొనుగోలు చేసి నిందితులు దాన్ని చదును చేసి క్రికెట్ మైదానంలా తీర్చిదిద్దారు. పిచ్‌ను తయారు చేశారు. హాలోజన్ లైటింగ్‌ను ఏర్పాటు చేసి.. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం సైతం నిర్వహిస్తున్నారు. గ్రామానికి చెందిన కూలీలు, యువకులతోనే జట్లు ఏర్పాటు చేసి, మ్యాచ్‌లు నిర్వహించారు. మ్యాచ్ కామెంట్రీ కోసం ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష బోగ్లేను మిమిక్రీ చేసే ఓ వ్యక్తిని నియమించుకోవడం గమనార్హం. స్టేడియంలో అభిమానులు కూర్చున్నట్లు, వారి సౌండ్ ఎఫెక్ట్‌లను సైతం అంతర్జాలం నుంచి డౌన్‌లోడ్ చేసుకొని సాక్షాత్తూ నిజం మ్యాచ్ జరుగుతున్నట్లుగానే జూదగాళ్లకు భ్రమ కల్పించారు.
ఈ నకిలీ లీగ్‌కు రష్యాలోని నగరాలైన మాస్కో, ట్వెర్, వొరోనెజ్ నుంచి పందేలను ఆహ్వానించారు. టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా బెట్టింగ్ తతంగాన్ని నిర్వహించారు. ఈ ఫేక్ లీగ్ క్వార్టర్ ఫైనల్ వరకు చేరింది. సెమీఫైనల్‌కు ముందు పోలీసులకు సమాచారం అందగా.. ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అసిఫ్ అహ్మద్ రష్యాలో ఉన్నాడని.. అక్కడి నుంచే ఈ లీగ్, బెట్టింగ్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. పలువురిపై కేసులు నమోదు చేసిన పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.