ఆత్మ విశ్వాసంతో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవటం, సానుకూల ఆలోచనలతో అడ్డంకులను అధిగమించటం ద్వారా ప్రతివ్యక్తి ఉన్నత శిఖరాలకు చేరుకోగలడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దివ్యాంగుడైన ఓ పెయింటర్ గీసిన చిత్రాలను చూసిన అనంతరం.. అతణ్ని కొనియాడుతూ మోదీ లేఖ రాశారు.
జైపుర్‌కు చెందిన అజయ్ గార్గ్.. చిన్నప్పుడు జరిగిన ఓ ప్రమాదం కారణంగా మూగ, చెవిటిగా మారాడు. గార్గ్ తాను గీసిన ఓ చిత్రాన్ని ప్రధాని మోదీకి ఇటీవల పంపగా.. ఆయన స్పందించారు. అజయ్ గార్గ్ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిమంతం అని పేర్కొంటూ ఓ లేఖ పంపారు.
"నీ జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఆత్మవిశ్వాసంతో సవాళ్లను ఎదుర్కోవటం, సానుకూల ఆలోచనలతో అడ్డంకులను అధిగమించటం ద్వారా కొత్త శిఖరాలను అధిరోహించగలం. కళపై మీకు ఉన్న అంకితభావం మీ చిత్రాల్లో ప్రతిబింబిస్తోంది. మీరు ఎంచుకున్న రంగంలో మీ పేరు ఉన్నత స్థాయికి చేరుకుంటుంది."