ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లాలో దారుణం జరిగింది. ఆరేళ్ల చిన్నారి కళ్లు, నోటిలో ఫెవిక్విక్ గమ్ పోసి అతికించింది ఓ మహిళ. అనంతరం బాలుడ్ని గ్రామ శివార్లలో ఉన్న చెరువులో పడేసింది. చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని చిట్నాపుర్ గ్రామానికి చెందిన కన్హయ్య(6).. గురువారం సాయంత్రం స్థానికంగా ఉన్న ఓ దుకాణానికి వెళ్లాడు. ఆ తర్వాత చాలా సమయం గడిచినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతడి కుటుంబసభ్యులు ఊరంతా వెతికినా పిల్లవాడి ఆచూకీ లభించలేదు. కొన్ని గంటలు గడిచాక.. గ్రామ శివార్లలో ఉన్న చెరువులో పిల్లవాడు పడి ఉన్నాడని సమాచారం అందింది.
వెంటనే గ్రామస్థులంతా అక్కడికి వెళ్లి చూడగా కన్హయ్య కళ్లు, నోరు గమ్‌తో అతుక్కుపోయి నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే హైదర్‌గఢ్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చిన్నారిని తరలించారు. దీంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం చిన్నారిని లఖ్‌నవూ మెడికల్ కాలేజీకి సిఫార్సు చేశారు. ప్రస్తుతం చిన్నారికి చికిత్స కొనసాగుతోంది. అయితే ఈ దుశ్చర్య తన పొరిగింటి మహిళ చేసి ఉంటుందని చిన్నారి తల్లి పోలీసులకు తెలిపింది. గత కొద్దిరోజులుగా తామిద్దరికి గొడవలు జరుగుతున్నాయని, అందుకే ఆమె ఇలా చేసి ఉంటుందని ఆరోపించింది. తన కొడుకు కూడా ఆమె పేరే చెప్పాడని తెలిపింది.
అనుమానాస్పద రీతిలో యువకుడి మృతదేహం లభ్యం..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. అంతకుమందు, గ్రామానికి చెందిన ఓ యువతి చనిపోయింది. అయితే వీరిద్దరూ ప్రేమించుకున్నారని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇది పరువు హత్యగా అనుమానిస్తున్నారు పోలీసులు.
పోలీసుల సమాచారం ప్రకారం.. రుధౌలీ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన రాంఫర్ కుమారుడు అంకిత్ అదే గ్రామానికి చెందిన ఇర్షాద్ వద్ద ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అంకిత్ మృతదేహం గ్రామంలో ఉన్న చెరకు తోటలో అనుమానాస్పద రీతిలో పడి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.