CJI NV Ramana: కుటుంబంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య బాధ్యతలను మహిళలే చూసుకుంటారు కాబట్టి వారి ఆరోగ్యం గురించి మిగతా కుటుంబసభ్యులే జాగ్రత్త వహించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. వారికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించి, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించాలన్నారు. రొమ్ము కేన్సర్‌పై డాక్టర్ కర్నల్ సీఎస్ పంత్, డాక్టర్ వనితా కపూర్‌లు రాసిన 'అట్లాస్ ఆఫ్ బ్రెస్ట్ ఎలాస్టోగ్రఫీ అండ్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ఫైన్ నీడిల్ సైటాలజీ' పుస్తకాన్ని ఆయన శనివారం దిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. భారత్‌లో 70% జనాభా కనీస వైద్య సౌకర్యాలూ లేని గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారని చెప్పారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (పీహెచ్‌సీ)ల్లో సరైన వసతులు ఉండటం లేదన్నారు. "పీహెచ్‌సీలు ఉంటే డాక్టర్లు ఉండటం లేదు. వైద్యులు ఉంటే పీహెచ్‌సీలు ఉండటం లేదు. రెండూ ఉన్న చోట మందులు ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న పరీక్షల ద్వారా ప్రాథమిక స్థాయిలో కేన్సర్‌ను గుర్తించడం మహిళలకు ఎంతో మేలుచేసే అంశం. తల్లి కానీ, భార్య కానీ దూరమైనప్పుడే మనకు వారి విలువ తెలుస్తుంది. నా తల్లి 86 ఏళ్ల వయస్సులో స్వర్గస్థురాలైనప్పటికీ ఇప్పటికీ ఆమె లేని లోటు కనిపిస్తూనే ఉంటుంది" అని పేర్కొన్నారు.
భారత్‌లో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళలో రొమ్ము కేన్సర్‌ను గుర్తిస్తున్నారని జస్టిస్ రమణ తెలిపారు. "2018లో భారత్‌లో గుర్తించిన అన్ని కేన్సర్‌లలో రొమ్ము కేన్సర్ వాటా 27.7% మేర ఉంది. దీని కారణంగా ప్రతి 8 నిమిషాలకో మహిళ ప్రాణాలు కోల్పోతోంది. ఈ వ్యాధి వల్ల 2018లో 87,090 మంది చనిపోయారు. కొత్త కేసుల్లో 32%.. 25-49 ఏళ్ల మధ్య మహిళల్లోనే బయటపడుతున్నాయి. అందువల్ల 50 ఏళ్లు పైబడిన వారికే రొమ్ము కేన్సర్ వస్తుందన్న భావన సరైందికాదు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉంటేనే వారసత్వంగా ఈ వ్యాధి వస్తుందని భావించడమూ తప్పు. రొమ్ముకేన్సర్ నివారణకూ ప్రాధాన్యం ఇవ్వాలి. విస్తృతంగా అవగాహన కల్పించాలి. ఇందులో ప్రముఖులు, మీడియా భాగస్వాములు కావాలి. పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలి. ప్రాథమిక దశలోనే పరీక్ష నిర్వహించి గుర్తించడంవల్ల మరణాలను అరికట్టవచ్చు. రోగనిర్ధారణ మౌలిక వసతులను పెంచాలి" అని కోరారు.