వైవాహిక బంధంలేని వ్యక్తుల మధ్య ఉండే లైంగిక సంబంధాలను భారతీయ శిక్షా స్మృతి కింద నేరంగా పరిగణించరాదంటూ 2018లో అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సైనిక దళాలకు వర్తింపజేయరాదన్న కేంద్ర ప్రభుత్వ విన్నపాన్ని సుప్రీంకోర్టు పరిశీలనకు స్వీకరించింది. ఈ తీర్పుపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్‌కు బుధవారం జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్, జస్టిస్ నవీన్ సిన్హా, జస్టిస్ కె.ఎం.జోసెఫ్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నోటీసు జారీ చేసింది. న్యాయపరమైన ఈ అంశంలో స్పష్టత కోసం అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ ఎస్.ఎ.బోబ్డేకు సూచించింది.
ఇదీ జరిగింది
2018లో అప్పటి సీజేఐ దీపక్ మిశ్ర నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం.. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్497(వ్యభిచారం)ను కొట్టివేసింది. ఈ తీర్పును పునఃపరిశీలించాలంటూ జోసెష్ షైన్ అనే వ్యక్తి ఇటీవల ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర పిటిషన్ దాఖలు చేస్తూ..2018 లో సుప్రీంకోర్టు తీర్పును సైనిక దళాలకు వర్తింపచేయరాదని కోరింది. దేశరక్షణ విధుల్లో భాగంగా సైనిక సిబ్బంది/అధికారులు తమ కుటుంబాలకు నెలల తరబడి దూరంగా ఉంటారని, అలాంటి సమయంలో వారి భార్యా,పిల్లల రక్షణ బాధ్యతను ఇతర సిబ్బంది/లేదా అధికారులు పర్యవేక్షిస్తుంటారని కేంద్రం తెలిపింది. సైనిక విభాగాల్లో క్రమశిక్షణను నెలకొల్పేందుకు వివాహేతర సంబంధాలను నేరంగానే పరిగణించాలని పేర్కొంది.
ఇదీ చూడండి:'లవ్ జిహాద్' చట్టాల పరిశీలనకు సుప్రీం ఓకే