పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో భారత పర్యటన నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బిలావల్ భారత పర్యటన వివరాల ప్రకటన తర్వాత పూంచ్‌లో ఉగ్రమూకల దాడిలో ఐదుగురు సైనికులు అమరులు కావడం కలకలం రేపింది. ఈ దాడి పాకిస్థాన్ ఉగ్రమూకల కుట్రగా తేలడంపై జైశంకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ లాంటి పొరుగు దేశంతో సంబంధాలు అసాధ్యమంటూ జై శంకర్ వ్యాఖ్యానించారు.
"షాంఘై సహకార సంస్థ సదస్సుకు ఈ సారి మేం(భారత్) అధ్యక్షత వహిస్తున్నాం. అందుకే భారత్‌లో ఈ సదస్సు జరగనుంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే పొరుగు దేశంతో(పాకిస్థాన్) సత్సంబంధాలు నెరపడం మాకు చాలా కష్టమైన పని. ఎందుకంటే భారత్‌కు వ్యతిరేకంగా ఆ దేశం సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా గళం వినిపిస్తున్నా పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉంది. కానీ ఏదో ఒకరోజు మేం ఈ ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్న నమ్మకం మాకుంది."
-జైశంకర్, విదేశాంగమంత్రి
11 ఏళ్ల తర్వాత భారత్‌కు..!
సుమారు 11 ఏళ్ల తర్వాత పాకిస్థాన్ విదేశాంగమంత్రి భారత్ పర్యటనకు రానున్నారు. మే 4, 5 తేదీల్లో గోవాలో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో విదేశాంగ మంత్రుల సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధిగా బిలావల్ భుట్టో పాల్గొంటారు. తాను ఈ సమావేశంలో పాల్గొనడం పాక్‌కు ఎస్సీఓ చార్టర్ పట్ల ఉన్న నిబద్ధతకు అద్దం పడుతుందని బిలావల్ భుట్టో ఇప్పటికే వెల్లడించారు. తన భారత పర్యటనలో ద్వైపాక్షిక కోణం లేదని కూడా పాక్ విదేశాంగ మంత్రి వివరించారు. ఎస్సీఓ వేదికపై ద్వైపాక్షిక సమస్యలు ప్రస్తావించే అవకాశం లేదన్న నిబంధనలను బిలావల్ భుట్టో గుర్తు చేశారు.
పనామా, కొలంబియా పర్యటనలో జైశంకర్
రెండు రోజుల పర్యటనలో భాగంగా పనామా దేశం వెళ్లిన మంత్రి జైశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి జనినా తెవానీ మెన్‌కోమోతో కలిసి ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఇరుదేశాల ఆరోగ్యం, వాణిజ్య రంగాలకు సంబంధించి మాట్లాడుకున్నారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దాయాది దేశంపై జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పర్యటనలో ఆయన ఇండియా-లాటిన్ అమెరికా బిజినెస్ ఈవెంట్‌కు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారత్-పనామా వ్యాపార బలోపేతానికి గల పది ముఖ్యమైన కారణాలను ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు జైశంకర్. పనామా పర్యటన అనంతరం కొలంబియాకు వెళ్లారు జైశంకర్. తమ దేశానికి విదేశాంగ మంత్రులు రావటం ఇదే మొదటిసారని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక్కడ ఆయన పలువురు ప్రతినిధులను కలుస్తారని వెల్లడించింది.