Extension of judicial custody of Magunta Raghavareddy: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డిని ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మారోసారి విచారించింది. విచారణ అనంతరం రాఘవ రెడ్డి.. జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేసిన ఉత్తర్వులలో ఈ నెల 28వ తేదీ వరకు మాగుంట రాఘవ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా, దిల్లీ మద్యం కేసుకు సంబంధించిన దర్యాప్తులో పురోగతి ఉందన్న ఈడీ.. మాగుంట రాఘవ రెడ్డి జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 28 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈడీ విచారణపై సస్పెన్స్:మరోవైపు దిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి.. ఒంగోలు వైసీపీ ఎంపీ శ్రీనివాసులు రెడ్డికీ కూడా మార్చి 16వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జారీ చేసిన నోటీసుల్లో ఈనెల 18వ (ఈరోజు) తేదీన విచారణకు రావాలని మాగుంటను ఆదేశించింది. ఈ క్రమంలో నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆఫీసులో విచారణకు హాజరుకావాల్సిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి.. ఇప్పటివరకూ ఈడీ ఆఫీసుకు చేరుకోకపోవటంతో ఉత్కంఠ నెలకొంది. అరుణ్ పిళ్లై-మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కలిపి ప్రశ్నించాలని ఈడీ అధికారులు ఎదురుచూస్తుండగా ఆయన ఇంకా ఈడీ ఆఫీసుకు చేరుకోకపోవటంతో సందిగ్ధత వాతావరణం ఏర్పడింది.
మాగుంట రాఘవ రెడ్డిని ఈడీ ఎందుకు అరెస్ట్ చేసిందంటే..?:దిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి.. సిండికేట్ ఏర్పాటు, ముడుపులు ముట్టజెప్పడంలో మాగుంట రాఘవ్ కీలకపాత్ర పోషించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మాగుంట ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దిల్లీలో రెండు రిటైల్ జోన్లను రాఘవ తన గుప్పిట్లో పెట్టుకొని.. దిల్లీ మద్యం విధానంలో మద్యాన్ని ఉత్పత్తి చేసేవారికి రిటైల్ జోన్లు ఉండకూడదనే నిబంధనకు వ్యతిరేకంగా వ్యవహారించారని ఈడీ ప్రస్తావించింది. మాగుంట ఆగ్రోఫామ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భాగస్వాములుగా కాగితాల్లో పేర్కొన్న పేర్లన్నీ డమ్మీలేనని ఈడీ కోర్టుకు తెలిపింది. రాఘవ తండ్రి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ద్వారానే అతను.. మద్యం వ్యాపారంలో భాగస్వామ్యం దక్కించుకున్నట్లు ఈ కేసులో నిందితుడుగా ఉన్న సమీర్ మహేంద్రు స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు ఈడీ వెల్లడించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు రాఘవ రెడ్డిని తిహాడ్ జైలుకు తరలించారు.
ఎంపీ శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీ: ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికీ ఈడీ నోటీసులు ఎందుకు జారీ చేసింది..? అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది. దిల్లీ మద్యం కుంభకోణంలో మరో నిందితుడైన అరుణ్ పిళ్లైని ఈడీ విచారిస్తున్న క్రమంలో... కొత్త మద్యం విధానాన్ని అనుసరించి.. దిల్లీలో మద్యం వ్యాపారం చేయడానికి తాను చాలా ఆసక్తితో ఉన్నానని, ఇక్కడ వ్యవహారాలన్నీ తన కుమారుడు రాఘవ్ చూసుకుంటారని.. ఎంపీ శ్రీనివాసులు రెడ్డి అన్నట్లు పిళ్లై తెలిపారు. మద్యం విధానంలోని విషయాలను లోతుగా తెలుసుకోవటం కోసం తాను దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమయ్యానని, ఇక్కడి వ్యాపారంలోకి ఆయన తనను ఆహ్వానించారని శ్రీనివాసులు రెడ్డి అన్నట్లు అరుణ్ పిళ్లై స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ శ్రీనివాసులు రెడ్డిని కూడా విచారించాలని నిర్ణయించిన.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండు రోజులక్రితం (16వ తేదీన) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈనెల 18వ తేదీన (ఈరోజు) ఈడీ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని ఎంపీ శ్రీనివాసులు రెడ్డిని ఆదేశించింది.
ఇవీ చదవండి