సాధారణ జలుబుకు కారణమయ్యే వైరస్లు సార్స్ కోవ్-2(కొవిడ్-19) వ్యాధి నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు ఓ పరిశోధన తేల్చింది. ఈ అధ్యయనం జర్నల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మెడిసిన్‌లో మంగళవారం ప్రచురితమైంది. సాధారణ శ్వాసకోశ సంబంధిత 'రైనోవైరస్'.. ఇంటర్ఫెరాన్ ప్రేరేపిత జన్యు కార్యకలాపాలను ప్రారంభిస్తుందని గుర్తించింది. ఈ జన్యువులు రోగనిరోధక వ్యవస్థలోని అణువులు ముందస్తుగా స్పందించేలా చేస్తాయని, దాని ద్వారా జలుబు సోకిన వాయుమార్గ కణజాలంలో సార్స్ కోవ్-2 పునరుత్పత్తిని అడ్డుకుంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
" కొవిడ్-19 వ్యాప్తి చెందే క్రమంలో రక్షణ వ్యవస్థను ముందస్తుగా మేల్కొలపటం ద్వారా.. దానిని నిరోధిస్తుంది. ఇలా చేసేందుకు ఒక మార్గం ఉంది. రోగులకు ఇంటర్ఫెరాన్స్తో చికిత్స చేయటం. రోగనిరోధక వ్యవస్థ ప్రోటీన్ అయిన ఇంటర్ఫెరాన్ ఔషధంగానూ లభిస్తుంది. అయితే.. ఇది పూర్తిగా సమయంపై ఆధారపడి ఉంటుంది. "
- ఎలెన్ పాక్స్మాన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, అమెరికా.
కొవిడ్-19 బారిన పడిన తర్వాత ఇంటర్ఫెరాన్ అధిక మోతాదులతో వ్యాధి తీవ్రత ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది. అది రోగనిరోధక వ్యవస్థ అతిగా ప్రతిస్పందించేందుకు కారణమవుతున్నట్లు గతంలో గుర్తించారు. అయినప్పటికీ.. ఇటీవలి జన్యుపరమైన పరిశోధనలను పరిశీలిస్తే.. ఇంటర్ఫెరాన్ ప్రేరేపిత జన్యువులు కొవిడ్-19 నుంచి రక్షణ కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రతి ఆరుగంటలకు రెండింతలు..
ఆ దిశగా పరిశోధన చేపట్టిన శాస్త్రవేత్తలు రైనోవైరస్లు.. సార్స్‌కోవ్-2 వైరస్‌కు వ్యతిరేకంగా ఉపయోగపడతాయని గుర్తించారు. ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన మానవ శ్వాసకోశ కణజాలం వైరస్ బారినపడేలా చేశారు. తొలి మూడు రోజులు పరిశీలించారు. ప్రతి ఆరు గంటలకు వైరస్ లోడ్ రెండింతలైనట్లు కనుగొన్నారు. అయితే.. రైనోవైరస్ బారిన పడిన కణజాలంపై కొవిడ్-19 పునరుత్పత్తి పూర్తిగా ఆగిపోయినట్లు నిర్ధరించారు.
" కొవిడ్ బారిన పడిన ప్రారంభ దశలో నాసల్ స్వాబ్ నమూనాలు పరిశీలించాం. వ్యాధి బారిన పడిన తొలి రోజుల్లో సార్స్ కొవ్-2 వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు ఆధారాలున్నాయి. రోగనిరోధక వ్యవస్థ మేల్కొనేలోపే ఇది జరిగిపోతోంది. ప్రతి ఆరు గంటలకు రెండింతలవుతోంది. కొంత మంది రోగుల్లో అది మరింత ఎక్కువగా ఉంది. ఇంటర్ఫెరాన్ చికిత్స వైరస్‌ను అడ్డుకుంటుంది. కానీ అది గమ్మత్తైన విషయం. వ్యాధి బారిన పడిన తర్వాత లక్షణాలు కనిపించనపుడే ఇది ప్రభావంతంగా ఉంటుంది. "
- ఎలెన్ పాక్స్మాన్, అసిస్టెంట్ ప్రొఫెసర్, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్, అమెరికా.
కొవిడ్-19 చికిత్సలో ఇంటర్ఫెరాన్ ట్రయల్స్ జరుగుతున్నాయని, ఇప్పటి వరకు వ్యాధి బారిన పడిన తొలి దశలోని రోగుల్లో సానుకూల ఫలితాలు కనిపించాయన్నారు ఫాక్స్మాన్. ఏడాదిలోని నిర్దిష్ట సమయంలో జలుబు అనేది సాధారణంగా ఎందుకు ఉంటుంది, ఆ సమయంలో ఇన్‌ఫ్లూయెంజా వంటి ఇతర వైరస్ల ప్రభావం తక్కువగా ఎందుకు ఉంటుందనే అంశాన్ని తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందన్నారు.
ఇదీ చూడండి:'డెల్టా వేరియంట్‌పై ఆ టీకా భేష్'