National Herald case: బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా భారతీయుల వాణిని వినిపించేందుకు 1938లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవహర్‌లాల్ నెహ్రూ 'నేషనల్ హెరాల్డ్' పత్రికను ప్రారంభించారు. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్) సంస్థ ఆధ్వర్యంలో పత్రిక నిర్వహణ కొనసాగింది. స్వాతంత్య్ర సమరయోధులు 5వేల మంది వాటాదారులు కాగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాన దాత. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ అధికార పత్రికగా నేషనల్ హెరాల్డ్ ఆంగ్లంలో, 'క్వామీ అవాజ్'గా ఉర్దూలో, 'నవజీవన్'గా హిందీలో వెలువడేది. 2008లో నేషనల్ హెరాల్డ్ పత్రిక మూతపడే నాటికి రూ.90.25 కోట్ల మేర కాంగ్రెస్ పార్టీకి ఆ సంస్థ బకాయిపడింది. ఇది వడ్డీలేని రుణం.
యంగ్ ఇండియన్ లిమిటెడ్ ప్రారంభం:కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఐక్య ప్రగతిశీల కూటమి(యూపీఏ) 2009లో వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చింది. ఏడాది తర్వాత 2010లో లాభాపేక్షలేని దాతృసంస్థగా యంగ్ ఇండియన్ లిమిటెడ్(వైఐఎల్) ఆవిర్భవించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆ సంస్థ డైరెక్టర్. రాహుల్‌తో పాటు సోనియా గాంధీ, కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ ఆ సంస్థ భాగస్వాములు. ఆ తర్వాత మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్ మృతి చెందారు.
2010 నాటికి ఏజేఎల్ 1057 మంది షేర్ హోల్డర్లను కలిగి ఉంది. వారిలో కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి శాంతి భూషణ్ తండ్రి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మార్కండేయ కట్జు తండ్రి కూడా ఉన్నారు. అయితే, తనకు బకాయిపడిన ఏజేఎల్‌ను కాంగ్రెస్ పార్టీ 2011లో యంగ్ ఇండియన్ లిమిటెడ్‌కు అప్పగించింది. దీనికి గాను కాంగ్రెస్ పార్టీకి రూ.50 లక్షలను చెల్లించిన వైఐఎల్...నేషనల్ హెరాల్డ్ హక్కులను సొంతం చేసుకుంది. 2016లో ఏజేఎల్... మూడు భాషల్లో పత్రికలను పునఃప్రారంభించింది.
2012 నుంచి కీలక మలుపులు:నేషనల్ హెరాల్డ్, ఏజేఎల్ అప్పులు, ఆస్తులన్నీ యంగ్ ఇండియా లిమిటెడ్‌కు దఖలుపడిన తర్వాత ఈ మొత్తం వ్యవహారం కీలక మలుపులు తీసుకుంది. నేషనల్ హెరాల్డ్ విషయంలో భారీ కుంభకోణం జరిగిందని, సోనియా, రాహుల్ గాంధీ తదితరులకు దీనిలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ రాజకీయ నాయకుడు, న్యాయవాది సుబ్రమణ్య స్వామి 2012లో దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.