Third wave in India latest news: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే 60కిపైగా దేశాలకు వ్యాపించింది. భారత్‌లోనూ అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మూడో వేవ్ రాబోతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త వేరియంట్ వచ్చినంత మాత్రాన దయనీయమైన పరిస్థితులు తలెత్తుతాయని భావించాల్సిన అవసరం లేదన్నారు. అయితే, కొంత అనిశ్చితి మాత్రం ఉంటుందని తెలిపారు.
మహమ్మారి ఇంకా అంతం కాలేదని పూనమ్ తెలిపారు. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కేసులు ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్ని మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. అలాగే వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలన్నారు.
ఇప్పటికే ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడం, అలాగే అనేక పరివర్తనాలు వెలుగుచూసిన నేపథ్యంలో.. ఈ కొత్త వేరియంట్ ప్రభావం తీవ్రంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయని పూనమ్ అభిప్రాయపడ్డారు. అయితే, అది ఎలాంటి ప్రభావం అనేది మాత్రం ఇప్పుడే నిర్ధరించలేమన్నారు. మరింత స్పష్టత కోసం ప్రతి దేశం సమగ్రమైన సమాచారం పంపాలని కోరారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ వ్యాప్తి, తీవ్రత, ఇన్ఫెక్షన్ రేటు, లక్షణాలను నిర్ధారించడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయన్నారు.
దక్షిణాఫ్రికా నుంచి అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఒమిక్రాన్ వల్ల రీఇన్ఫెక్షన్లు అధికంగా నమోదవుతున్నాయని పూనమ్ తెలిపారు. అలాగే డెల్టాతో పోలిస్తే వ్యాధి తీవ్రత కూడా తక్కువగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. కానీ, ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరికాదన్నారు.
ఇదీ చూడండి:-Omicron Variant News : వ్యాప్తిలో ఒమిక్రాన్ వేగం.. వ్యాక్సిన్‌తో దూరం