కరోనా ఉద్ధృతి నేపథ్యంలో.. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ బోర్డు ఇటీవల నిర్ణయం తీసుకుంది. మరి వారికి మార్కుల కేటాయింపు ఎలా? గ్రేడ్లు ఎలా ఇస్తారు? ఇలాంటి ప్రశ్నలు ఎందరికో సాధారణంగా కలిగేవే.
మూల్యాంకనం ఎలా చేయనున్నారో.. కేంద్రం వివరాలు వెల్లడించింది.
12వ తరగతికి మార్కులు ఎలా?
ఇందుకోసం.. 30:30:40 ఫార్ములాను అవలంబించనున్నారు. అంటే 10,11 తరగతుల్లో నుంచి 30 శాతం చొప్పున వెయిటేజీ, 12వ తరగతికి 40 శాతం వెయిటేజీ ఇచ్చి మార్కులను నిర్ణయించనున్నారు.
వెయిటేజీ ఎలా తీసుకుంటారు?
- 12వ తరగతిలో ప్రీ బోర్డు, మిడ్-టర్మ్, యూనిట్ పరీక్షల్లో ప్రదర్శన ఆధారంగా.. ఈ 40 శాతం మార్కులు కేటాయిస్తారు.
- 11వ తరగతి ఫైనల్ పరీక్షల ఆధారంగా 30 శాతం మార్కులు కేటాయిస్తారు.
- పదో తరగతికి సంబంధించి 30 శాతం వెయిటేజీని.. ఐదు పేపర్ల నుంచి మెరుగైన మార్కులున్న మూడు పేపర్లను పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తారు.
వారికి నష్టమేనా?
నిర్దిష్ట కాలపరిమితిలో మెరుగైన పురోగతి కనబరిచే విద్యార్థులకు.. ఈ మూల్యాంకన విధానం చేటు చేస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఎప్పుడూ స్థిరత్వం చూపించదని చెబుతున్నారు.
నిపుణుల మాటేంటి?
కేంద్రం ప్రాతిపాదనలపై పలువురు విద్యావేత్తలు, నిపుణులు మండిపడుతున్నారు. కొందరు మాత్రం ప్రశంసిస్తున్నారు.
"ఈ రకమైన ప్రమాణాలతో.. వ్యవస్థను సరిదిద్దలేరు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో.. ఈ రకమైన మూల్యాంకనం సరైనది కాదు."
-మనిత్ జైన్, ఫిక్కీ ఎరైస్ ఛైర్మన్
ఈ విధానం.. నిర్దిష్ట కాలంలో పరిమిత లక్ష్యాలను సాధించేందుకు తోడ్పడుతుంది.. కానీ ఇది కచ్చితమైన, న్యాయమైన పద్ధతికి ఎంతో దూరంలో ఉంది అంటున్నారు హెరిటేజ్ స్కూల్స్ సీఈఓ విష్ణు కార్తిక్.
10,11 తరగతుల్లో పనితీరు ఆధారంగా.. 12వ తరగతి మార్కులు గణించడం తప్పని తేలినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ఇంకొందరు అంటున్నారు.
"విద్యార్థులు 11వ తరగతిలో కాస్త రిలాక్స్ అవుతారు. అప్పుడు మార్కుల శాతం తగ్గుతుంది. ఇంకా.. 10, 11 తరగతుల పాఠ్యాంశాలు, 12వ తరగతి సబ్జెక్టులు ఒకేలా ఉండవు కదా."
-రజత్ గోయెల్, ఎంఆర్జీ స్కూల్ డైరెక్టర్
ఆ మార్కులొద్దా?
12వ తరగతిలో తమ మార్కుల శాతాన్ని పెంచుకొని, చక్కని భవిష్యత్తును నిర్మించాలనుకొనే విద్యార్థుల్లో ఎన్నో ప్రశ్నలున్నాయని చెబుతున్నారు రజత్.
"12వ తరగతిలో వొకేషనల్ సబ్జెక్టులుంటాయి. లలిత కళలు, శారీరక విద్య సహా ఇతరత్రా.. మార్కుల శాతాన్ని పెంచుకునేందుకు ఉపకరిస్తాయి. తమ మార్కులను పెంచుకొని చక్కని భవిష్యత్తుకు పునాదిగా వేసుకోవాలనే ఎందరో విద్యార్థులకు.. ఈ విధానంతో అన్యాయం జరుగుతుంది."
-రజత్ గోయెల్, ఎంఆర్జీ స్కూల్ డైరెక్టర్, రోహిణి
ఆ విధానం మంచిదే..
బెస్ట్ ఆఫ్ త్రీ సబ్జెక్ట్స్ ఆధారంగా 30 శాతం మార్కులు కేటాయించాలని తీసుకున్న నిర్ణయం మంచిదేనని సేథ్ ఆనంద్రామ్ జైపురియా గ్రూప్ ఛైర్మన్ శిశిర్ జైపురియా పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ సిలబస్ ఉంటుంది కాబట్టి పదకొండు, పన్నెండు తరగతుల్లో విద్యార్థుల ప్రతిభను దీని ద్వారా అంచనా వేయడం వల్ల ఫలితాలు సమగ్రంగా ఉంటాయని తెలిపారు.
ఇదీ చదవండి:CBSE: జులై 31న 12వ తరగతి ఫలితాలు!