దేశంలో ప్రస్తుతం జరుగుతున్న కొవిడ్ వ్యాక్సినేషన్‌ను ఇదే వేగంతో కొనసాగిస్తే.. ఈ ఏడాది చివరికి 18 ఏళ్లు పైబడిన వారిలో కేవలం 30 శాతం మందికే టీకా అందుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదేమాత్రం సరిపోదని నిపుణులు సూచిస్తున్నారు. ఏడాది చివరికి కనీసం 80 శాతం మందికైనా టీకా అందించాలి. ఈ లక్ష్యం సాధించాలంటే ఇప్పటినుంచి నెలకు కనీసం 10 కోట్ల డోసులైనా వేయగలగాలి.
- దేశంలో 18 ఏళ్లు దాటినవారి జనాభా సుమారు 93.9 కోట్లు. వీరికి రెండు డోసుల లెక్కన మొత్తం 187.80 కోట్ల డోసులు వేయాలి. ఇందులో 35 శాతం డోసులు (65 కోట్లు) జనసాంద్రత, వైరస్ సోకే అవకాశం ఎక్కువున్న పట్టణ ప్రాంతాల్లోనే వేయాలి.
- అవసరం, డిమాండ్‌కు అనుగుణంగా దేశంలో టీకాల ఉత్పత్తి లేకపోవడమే ప్రధాన సమస్య. ప్రస్తుతం పుణెలోని సీరం సంస్థ తయారుచేసే కొవిషీల్డ్, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకాలే అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు సంస్థలు కలిపి నెలకు 8-10 కోట్ల డోసులు ఉత్పత్తి చేస్తున్నట్టు అంచనా. కానీ భారత్‌లో ఈ ఏడాది చివరికి ప్రామాణిక వ్యాక్సినేషన్ (80 శాతం) సాధించాలంటే నెలకు 22 కోట్ల డోసులు తయారవ్వాలి.
- సీరం సంస్థకు నెలకు గరిష్ఠంగా 7 కోట్ల డోసులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. మే నెలాఖరుకు ఈ సామర్థ్యాన్ని 10 కోట్లకు పెంచుకోనున్నట్టు చెబుతోంది. భారత్ బయోటెక్ కూడా మే నెలలో 3 కోట్ల డోసులు తయారు చేస్తామని ప్రకటించింది. ఆగస్టు నాటికి నెలవారీ ఉత్పత్తి సామర్థ్యం 6 కోట్లకు పెంచుకోనున్నట్టు తెలిపింది. మరోవైపు జూన్ నాటికి రష్యాకు చెందిన 65 కోట్ల స్పుత్నిక్ టీకాలు భారత్‌లో అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ అనుకున్నట్టుగా జరిగితేనే టీకా ఉత్పత్తి అంతరం కొంతవరకైనా తగ్గుతుంది.
ప్రపంచ ప్రమాణాలతో.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్