తెలంగాణ

telangana

ETV Bharat / bharat

డెల్టా ప్లస్​తో మరో ముప్పు తప్పదా- నిపుణుల మాటేంటి? - Union Health Ministry

దేశంలో కరోనా కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్​లోనే తొలిసారి వెలుగుచూసిన డెల్టా వేరియంట్​.. రెండో దశలో తీవ్ర ప్రభావం చూపగా, ఇప్పుడు మరో మ్యుటేషన్​ డెల్టా ప్లస్ ప్రజల్లో భయాల్ని పెంచుతోంది. ఈ రకం వైరస్​ వ్యాప్తి వేగంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్ట్​ వేవ్​కు ముందు ఈ కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ఇంకా.. డెల్టా ప్లస్​ వేరియంట్​ గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు వైద్య నిపుణులు డా. సునీలా గార్గ్​. ఏమంటున్నారో ఆమె మాటల్లోనే..

Experts in India issues caution over Delta+
డెల్టా ప్లస్​తో మరో ముప్పు తప్పదా

By

Published : Jun 24, 2021, 5:32 PM IST

Updated : Jun 24, 2021, 6:03 PM IST

కరోనా రెండో దశ తగ్గుముఖం పడుతుందనుకుంటున్న క్రమంలో.. డెల్టా ప్లస్​ వేరియంట్​ ఆందోళన కలిగిస్తోంది. డెల్టా వేరియంట్​లో సంభవించిన మ్యుటేషన్​ కారణంగా పుట్టుకొచ్చిన ఈ తరహా కేసులు దేశంలో పెరిగిపోతున్నాయి.

ఇప్పటివరకు ఎన్ని కేసులు..

  • మహారాష్ట్రలో అత్యధికంగా 21 మంది ఈ వైరస్​ బారినపడ్డారు. రాష్ట్రంలో కేసులు తగ్గుతున్న కారణంగా.. లాక్​డౌన్​ సడలింపులతో పర్యటకుల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలోనే డెల్టా ప్లస్​ కేసులు పెరగడం అక్కడి ప్రజల్లో మళ్లీ భయాల్ని పెంచుతున్నాయి.
  • కేరళ, మధ్యప్రదేశ్​లోనూ ఈ తరహా వేరియంట్​ కేసులు వెలుగుచూస్తున్నాయి. మధ్యప్రదేశ్​లో ఐదుగురు దీని బారినపడగా.. ఒకరు చనిపోయారు. మిగతా నలుగురూ.. టీకా తీసుకున్నవాళ్లేనని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.
  • కర్ణాటకలో డెల్టా ప్లస్​ కేసుల సంఖ్య రెండుకు చేరింది. జూన్​ 22న మైసూర్​లో తొలి కేసు వెలుగుచూడగా.. మరుసటి రోజు బెంగళూరులోనూ ఒకరికి ఈ వైరస్​ సోకిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్​ వెల్లడించారు.
  • జమ్ముకశ్మీర్​ కత్రా ప్రాంతంలోనూ డెల్టా ప్లస్​ వేరియంట్​ కేసు వెలుగుచూసిందని అధికారులు తెలిపారు.

తీవ్రమైనదా?

డెల్టా ప్లస్​ వేరియంట్​ను ఆందోళనకరమైనదిగా పరిగణించాలని (వేరియంట్​ ఆఫ్​ కన్సర్న్​-వీఓసీ) కేంద్రం మంగళవారమే ప్రకటించింది. చాలా మందిపై ఇది తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ డెల్టా ప్లస్​ వేరియంట్​ గురించి కీలక విషయాలు వెల్లడించారు సీనియర్​ ప్రజారోగ్య నిపుణురాలు, ఇండియన్​ అసోసియేషన్​ ఆఫ్​ ప్రివెంటివ్​ అండ్​ సోషల్​ మెడిసిన్​(ఐఏపీఎస్​ఎం) అధ్యక్షురాలు డా. సునీలా గార్గ్​.

వేగంగా వ్యాప్తి?

డెల్టా ప్లస్​ వేరియంట్​ వ్యాప్తి ఎక్కువగా ఉందని, యాంటీబాడీలను తగ్గిస్తుందని చెప్పారు గార్గ్​. టీకా తయారీదారులు.. యాంటీబాడీ బూస్టర్​ను ప్రోత్సహించడంతో పాటు వేరియంట్లకు అనుగుణంగా.. వ్యాక్సిన్లలో మార్పులు చేస్తుండాలని సూచించారు.

టీకా పనిచేయదా?

మనం టీకా తీసుకున్నప్పటికీ ఈ వైరస్​ సోకే అవకాశాలున్నాయని పేర్కొన్నారు డా. సునీలా. మనలో యాంటీబాడీలు ఉన్నా, వ్యాక్సిన్​ తీసుకున్నా.. వైరస్​కేం అడ్డురాదని వివరించారు.

ఇప్పుడున్న వ్యాక్సిన్లు సరిపోవా?

డెల్టా ప్లస్​ వేరియంట్​ జన్యుశ్రేణిని వీలైనంత త్వరగా గుర్తించి.. దానికి తగ్గట్లు వ్యాక్సిన్లను అప్​డేట్​ చేయాలని సూచించారు గార్గ్​. అయితే ప్రస్తుతం మనదేశంలో ఉన్న వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్​పై మాత్రం బాగానే పనిచేస్తున్నాయని అన్నారు.

''మనకు కొవాగ్జిన్​, కొవిషీల్డ్​, స్పుత్నిక్​.. 3 వ్యాక్సిన్లు ఉన్నాయి. ఆస్ట్రాజెనెకా(కొవిషీల్డ్​) టీకా డెల్టా వేరియంట్​పై 60 శాతం సమర్థంగా పనిచేస్తోంది. ఫైజర్​ మాత్రం 88 శాతం మెరుగ్గా పనిచేస్తోంది.''

- సునీలా గార్గ్​

బూస్టర్​ డోసు అవసరమా?

కొత్త కొత్త వేరియంట్లు వెలుగుచూస్తున్న నేపథ్యంలో.. టీకా తయారీదారులు సందిగ్ధంలో పడ్డారని గార్గ్​ పేర్కొన్నారు. ఇప్పుడు బూస్టర్​ డోసు అవసరమా? టీకాలను సవరించాలా? అని ఆలోచిస్తున్నట్లు తెలిపారు.

డెల్టానా బీటానా..?

డెల్టా ప్లస్​ వేరియంట్​ లక్షణాలు.. డెల్టానే పోలినప్పటికీ, ఈ రకం మ్యుటేషన్ సౌతాఫ్రికాలో బీటా వేరియంట్​లో వెలుగు చూసిందని, ​అది టీకాను తప్పించుకొన్నట్లు గుర్తుచేశారు గార్గ్​.

అప్పట్లో సౌతాఫ్రికాలో వెలుగుచూసిన వేరియంట్లపై వ్యాక్సిన్​ పనిచేయట్లేదని.. ఆస్ట్రాజెనెకా టీకాను వెనక్కిపంపింది అక్కడి ప్రభుత్వం.

ఏం చేయాలి..?

బ్రిటన్​, అమెరికా సహా 9దేశాల్లో ఈ వేరియంట్​ కేసులు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయని, భారత్​లో ఇప్పుడు ప్రాథమిక దశలోనే ఉందని చెప్పారు గార్గ్​.

''డెల్టా ప్లస్​ వేరియంట్​ గురించి ప్రజలు అంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కరోనా సెకండ్​ వేవ్​లో డెల్టా వేరియంట్​ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిందో మీకు తెలుసు కదా.''

- డా. సునీలా గార్గ్​.

జాగ్రత్త..

డెల్టా ప్లస్​ కారణంగా.. ఇప్పుడు కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిందేనని, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆమె వివరించారు.

డెల్టా ప్లస్​ వేరియంట్​ విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పలు సూచనలు చేసింది. ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని, టెస్టింగ్​, ట్రాకింగ్​, వ్యాక్సినేషన్​ వేగం పెంచాలని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి: Vaccine for children: చిన్న పిల్లలకు టీకా ఎప్పుడు? ఎలా?

'టీకా వేసుకోకపోతే భారత్​కు వెళ్లండి.. లేకపోతే పందుల ఇంజక్షన్​'

Unesco: ప్రమాదంలో 'ప్రపంచ వారసత్వ సంపద'

Last Updated : Jun 24, 2021, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details