కరోనా వైరస్‌కు సంబంధించి అమెరికా వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) విడుదల చేసిన తాజా నివేదిక ఆందోళన కలిగిస్తోంది. డెల్టా వ్యాప్తిపై కొత్త విషయాలను ఇది వెలుగులోకి తెచ్చింది. టీకా తీసుకున్న, తీసుకోని వారిలో డెల్టా వైరస్ లోడు అధికంగా ఉంటోందని నివేదిక పేర్కొంది.
టీకా తీసుకున్నప్పటికీ డెల్టా వేరియంట్ సోకిన వ్యక్తి అదే స్థాయిలో వైరస్‌ను వ్యాప్తి చేస్తారని సీడీసీ స్పష్టం చేసింది. కాబట్టి, వ్యాక్సినేషన్ స్టేటస్‌తో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించింది.
"అధిక వైరల్ లోడు అంటే వైరస్ వ్యాప్తి చెందే ముప్పు కూడా ఎక్కువగా ఉంటుందని అర్థం. ఇతర వేరియంట్ల మాదిరిగా కాకుండా.. డెల్టా సోకిన వ్యక్తి వైరస్‌ను అదే స్థాయిలో వ్యాపింపజేస్తారు. ఈ ఫలితాల కారణంగానే మాస్కు నిబంధలను సీడీసీ సవరించింది. తమకు తెలియకుండా ఇతరులకు వైరస్ వ్యాప్తి చేయకుండా ఉంచేలా.. ఈ నిబంధన ఉపయోగపడుతుంది."
-రోషెల్ పీ వాలెన్స్కీ, సీడీసీ డైరెక్టర్
భారత్‌లోనూ అంతే..
ఈ నివేదిక భారత్‌లోని పరిస్థితులకూ వర్తిస్తుందని దేశంలోని నిపుణులు చెబుతున్నారు. మాస్కులు ధరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తున్నారు. ఇండోర్ సమావేశాలు, పని ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
"భారత్ విషయానికి వచ్చే సరికి ఈ అధ్యయనం చాలా ముఖ్యమైనది. మాస్కులను పెట్టుకోవడమే కాకుండా.. ఇండోర్ మీటింగులు, రెస్టారెంట్లు, బార్లు, పండగల సమావేశాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. డెల్టాపై అప్రమత్తత అవసరం."