దేశంలో కొవిడ్-19 బాధితులకు చికిత్స చేయడానికి కాన్వలసెంట్ ప్లాస్మాను ఎలాంటి హేతుబద్ధత లేకుండా, అశాస్త్రీయంగా ఉపయోగిస్తున్నారని పలువురు వైద్యులు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు కె.విజయ్ రాఘవన్‌కు లేఖ రాశారు. దీనిపై ప్రముఖ టీకా నిపుణురాలు గగన్‌దీప్ కాంగ్, శస్త్రచికిత్స నిపుణులు పరమేశ్ సి.ఎస్., భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తదితరులు సంతకాలు చేశారు.
ప్లాస్మా థెరపీలో.. కొవిడ్ నుంచి కోలుకున్న బాధితుడి రక్తం నుంచి యాంటీబాడీలను సేకరించి, పరిస్థితి విషమంగా ఉన్న కరోనా రోగులకు ఇస్తుంటారు. ఈ చికిత్సపై కేంద్ర ఆరోగ్య శాఖ గత నెలలో సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. నాటి నుంచే దీనిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వ్యాధి లక్షణాలు ఒక మోస్తరుగా ఉన్నప్పుడు, లక్షణాలు బయటపడ్డ ఏడు రోజుల లోపు ప్లాస్మాను ఇవ్వాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఏడు రోజుల తర్వాత ప్లాస్మాను ఇవ్వకూడదని, అధిక స్థాయిలో యాంటీబాడీలు కలిగిన దాతల ప్లాస్మా లభ్యమైనప్పుడే దాన్ని ఇవ్వాలని సూచించింది. అయితే ఇందులో ప్లాస్మాను 'ఆఫ్ లేబుల్' విధానంగా పేర్కొంది. ఇది వింతగా ఉందని నిపుణులు తమ తాజా లేఖలో పేర్కొన్నారు. 'ఆఫ్-లేబుల్' అంటే అనుమతిలేని వినియోగమని వివరించారు. కేంద్రం సూచనల నేపథ్యంలో ప్లాస్మా చికిత్సను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారని చెప్పారు. దీనిపై తక్షణం జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు విజయ్ రాఘవన్‌ను కోరారు.
కొత్త రకాలకు ఊతం
రోగనిరోధక సామర్థ్యం తక్కువగా ఉన్న వారికి ప్లాస్మాను ఇచ్చినప్పుడు.. యాంటీబాడీలకు పెద్దగా లొంగని కొత్త కరోనా వైరస్ రకాలు పుట్టుకురావొచ్చని ప్రాథమిక పరిశోధన ఫలితాలు చెబుతున్నట్లు నిపుణులు తమ లేఖలో వివరించారు. "దీని ప్రకారం చూస్తే హేతుబద్ధత లేకుండా ప్లాస్మా చికిత్సను చేయడం వల్ల ఉద్ధృతంగా వ్యాపించే వైరస్ రకాలు పుట్టుకురావొచ్చు. ఫలితంగా మహమ్మారి విజృంభించొచ్చు. వైద్యులు, ప్రజారోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలుగా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖను రాస్తున్నాం" అని పేర్కొన్నారు.