కరోనా టీకాల రెండు డోసుల మధ్య వ్యవధి పెంచే విషయమై అధ్యయనం చేయడానికి కేంద్రం ఉన్నతస్థాయి నిపుణుల బృందాన్ని నియమించింది. కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి ఎక్కువగా ఉంటే దాని సామర్థ్యం కూడా పెరుగుతుందని అంతర్జాతీయ పరిశోధకులు చెబుతున్న నేపథ్యంలో దాన్ని పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. అన్ని విషయాలను విశ్లేషించి వచ్చే వారమే నివేదిక సమర్పించే అవకాశం ఉంది.
కొవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి పెంపు! - కొవిషీల్డ్ డోసుల మధ్య వ్యవధి
కరోనా టీకా రెండు డోసుల మధ్య వ్యవధి పెంచాలని కేంద్రం యోచిస్తోంది. కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య 12 వారాల వ్యవధి ఉంటే టీకా సామర్థ్యం 81.3 శాతానికి పెరుగుతుందని ఇటీవల లాన్స్టె జర్నల్ తన ప్రచురణలో పేర్కొంది. ఈ నేపథ్యంలో.. దీనిపై అధ్యయనం చేయడానికి కేంద్రం ఉన్నతస్థాయి నిపుణుల బృందాన్ని నియమించింది.

కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య ఎంత వ్యవధి ఉండాలనే విషయమై జరిపిన పరిశోధనను లాన్సెట్ జర్నల్ ఈ ఏడాది మార్చి నెలలో ప్రచురించింది. దాని ప్రకారం రెండు డోసుల మధ్య వ్యవధి ఆరు వారాలు ఉంటే టీకా సామర్థ్యం 55.1 శాతంగా ఉంటుంది. అదే వ్యవధిని 12 వారాలకు పెంచితే సామర్థ్యం 81.3 శాతానికి పెరుగుతుంది. ఇదే టీకాను ఉపయోగిస్తున్న కెనడాలో 12 వారాలు, బ్రిటన్‌లో 16 వారాల విరామాన్ని అమలు చేస్తున్నారు. వ్యవధి పెరిగే కొద్దీ సామర్థ్యం కూడా పెరుగుతున్నట్టు తేలింది. భారత్‌లో కూడా కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి తొలుత 4-6 వారాలు ఉండగా, దాన్ని 6-8 వారాలకు పెంచుతూ ఈ నెలలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వ్యవధి పెంచడం వల్ల టీకాల సరఫరాపై ఒత్తిడి తగ్గి అందరికీ అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా మరింత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయడానికి వీలవుతుందని చెబుతున్నాయి.
ఇదీ చదవండి :'కొవిడ్‌పై పోరులో బంగాల్‌కు అండగా కేంద్రం'