ఈ నెల 16 నుంచి దేశంలో కరోనా టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభంకానుందని కేంద్రం చేసిన ప్రకటనపై ఆరోగ్య నిపుణులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఓ శుభపరిణామని పేర్కొన్నారు.
'పండుగల సమయంలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించడం మంచి పరిణామం' అని అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండియా డైరెక్టర్ జనరల్ డాక్టర్ గిరిధర్ జ్ఞాని 'ఈటీవీ భారత్'తో అన్నారు.
'టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన తర్వాత.. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యేందుకు కనీసం రెండు వారాల సమయం కావాలి. లాజిస్టిక్స్ సమస్యతో మొదలై.. వ్యాక్సినేషన్ కేంద్రాల గుర్తింపు, వ్యాక్సిన్ సరఫరా కోసం ప్రభుత్వ, ప్రైవేటు విమానయాన సంస్థలతో తుది ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటివి వాటికి ఇది అవసరమవుతుంది,' అని గిరిధర్ పేర్కొన్నారు.
ఈ రెండు వారాలు టీకా తయారు చేసే కంపెనీలకు ఎక్కువ డోసులు ఉత్పత్తి చేసేందుకూ ఉపయోగపడుతుందని తెలిపారు. ఒకసారి వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభిస్తే.. టీకా తయారీదారులు ఎక్కువ డోసులు ఉత్పత్తి చేసేందుకు వీలుంటుందని వివరించారు.