కేరళలో పాఠశాల ముందడుగు.. కళ్ల ముందే విజ్ఞానం ఆ బడిలో పిల్లలు ప్రపంచంలో ఉండే ఏ ప్రాంతానికైనా వెళ్లగలరు. అది గోవా ట్రిప్ అయినా.. పారిస్ టూరైనా. కేవలం ఒక్క బటన్ నొక్కి అక్కడి ప్రసిద్ధ ప్రాంతాల గురించి తెలుసుకోగలరు. ఎప్పుడు వెళ్లని తాజ్‌మహాల్‌ను సైతం... తమ చేతి వేళ్లతో తాకుతున్న అనుభూతి పొందగలరు. ఏలా అనుకుంటున్నారా? వారి పాఠశాలలో ఏర్పాటు చేసిన వర్చువల్ రియాలిటీ(వీఆర్) ల్యాబ్ సహకారంతో.
పిల్లలకు వర్చువల్ ప్లాట్‌ఫామ్ ద్వారా పాఠాలు బోధించడమే కాకుండా.. రియల్ టైం అనుభూతులను అందిస్తున్నారు ఆ బడిలోని ఉపాధ్యాయులు. ఇంతటి అధునాతన సాంకేతికత ఉన్న పాఠశాల కేరళ త్రిస్సూర్‌లో ఉంది. అదే శ్రీ నారాయణపురంలోని పనాంగడ్ హయ్యర్ సెకండరీ పాఠశాల.
వాస్తవికతకు పెద్దపీట..
ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన వర్చువల్ రియాలిటీ ల్యాబ్‌తో ప్రపంచంలో జరిగే విషయాలను, సంఘటనలను.. వాస్తవికతను కోల్పోకుండా అనుభూతి చెందుతున్నారు విద్యార్థులు. 'ఓక్యులస్' అనే అధునాతన పరిజ్ఞానం సాయంతో ఇది వీలవుతోందని అధ్యాపకులు చెబుతున్నారు.
ఖగోళం కళ్ల ముందు...
భౌతికశాస్త్రంలో ఉండే సూర్యుడు, భూమి, గ్రహాలు, ఉపగ్రహాలు, కక్ష్యలు, వాటి మధ్య ఉండే దూరం, రాత్రింబవళ్లు ఏర్పడే క్రమాన్ని కళ్లకు కట్టినట్లు వర్చువల్‌గా వివరిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆయా అంశాలపై మెరుగైన పరిజ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. ఇలా బోధించడం వల్ల పిల్లలకు విషయావగాహన మరింత పెరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
"ల్యాబ్‌లో ఉండే సాధనాలను చూడటం, వినడం, తాకడం ద్వారా పాఠ్యాంశాలను ఇంకా మెరుగ్గా అర్థం చేసుకోవచ్చు. స్మారక చిహ్నాలు, విగ్రహాలు, సంఘటనలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. వాటిలో అనేక అద్భుతాలు కూడా ఉన్నాయి. మానవ నిర్మితమైనవి, సహజమైన వాటిని ల్యాబ్‌లో ప్రత్యక్షంగా చూస్తున్న భావనతో పిల్లలు ఉంటారు. దీంతో అవి వారి మెదడులో ఎప్పటికీ నిక్షిప్తమై ఉంటాయి."
-ఉపాధ్యాయులు, పనాంగడ్ హయ్యర్ సెకండరీ పాఠశాల
మరికొన్ని ప్రయోగశాలలు..
హయ్యర్ సెకండరీ పాఠశాల కావడం వల్ల అక్కడ చదివే ఇంటర్ విద్యార్థులకు మరిన్ని ప్రయోగశాలలను అందుబాటలో ఉంచారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జువాలజీ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. వాటికోసం అత్యంత అధునాతన పరికరాలను కొనుగోలు చేశారు. మూత్రపిండాలు, డీఎన్ఏ నమూనాలు, గుండె కవాటాల పనితీరుని ప్రతిబంబించేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
పూర్వ విద్యార్థులే దాతలు...
దేశ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఈ వర్చువల్ రియాలిటీ ల్యాబ్.. అంత సులభంగా రూపుదిద్దుకోలేదు. లక్షల రూపాయిలు వెచ్చించారు. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని సమీకరించేందుకు అదే పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థులు తలో చేయి వేశారు. స్థానికంగా ఉండే పుతంకట్టిల్ కుంజికోరు ఫౌండేషన్ అనే ట్రస్ట్ ద్వారా కొంత సేకరించారు. పీకే అశోకన్, పుతంకట్టిల్ సుభాష్, పుతంకట్టిల్ సురేష్ చేసిన కృషి వల్లే తమ పాఠశాల కోసం వర్చువల్ రియాలిటీ ల్యాబ్ అందుబాటులోకి వచ్చిందని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ల్యాబ్‌ను పాఠశాలలో అమర్చేందుకు 'ఇన్ఫ్యూసరీ ఫ్యూచర్ టెక్' సంస్థ.. సాంకేతిక సాయం చేసిందని వెల్లడించారు.
ఇదీ చూడండి: ప్రత్యేకత చాటుతున్న కరెన్సీ మ్యూజియం