కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో ఉంటున్న కార్మికులు, విద్యార్థుల పరిస్థితిపై ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందన్నారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. కొవిడ్‌తో ఉపాధి కోల్పోయి స్వదేశానికి వచ్చిన వారిని గల్ఫ్ దేశాలు త్వరితగతంగా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటాయనే నమ్మకం ఉందన్నారు. కరోనా విజృంభణ సమయంలో.. వందే భారత్ మిషన్ కింద ఇప్పటివరకు 45.82 లక్షల మందిని స్వదేశానికి రప్పించినట్లు తెలిపారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో విదేశాల్లోని భారతీయులు, విద్యార్థుల పరిస్థితిపై ప్రకటన చేశారు జైశంకర్. విదేశాల నుంచి ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చిన వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అలాగే నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు చేసినట్లు చెప్పారు.