EXIT POLLS ACCURACY 2022: ఎన్నికలేవైనా, ఏ దేశమైనా ఒపీనియన్, ఎగ్జిట్ పోల్స్‌కు విశేష ప్రజాదరణ ఉంటుంది. కొన్నిసార్లు ఓటరు నాడి పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమైనా.. ఎక్కువ సందర్భాల్లో దాదాపుగా అవే ఫలితాలు వస్తున్నాయి. ఇందుకు తాజాగా జరిగిన గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలే సాక్ష్యంగా నిలిచాయి.
2022 గుజరాత్ ఎగ్జిట్ పోల్స్..
గుజరాత్లో భాజపా అధికారం నిలబెట్టుకుంటోందని ఎగ్జిట్ పోల్స్ ముందే అంచనా వేశాయి. వరుసగా ఏడోసారి కమలదళం జయభేరి మోగిస్తుందని అన్ని సంస్థల సర్వేలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్ రెండోస్థానానికి పరిమితం అవుతుందని.. ఆమ్ఆద్మీ పార్టీ పెద్దగా ఉనికి చాటుకోలేదని ఎగ్జిట్‌పోల్స్ తెలిపాయి.
ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే గుజరాత్లో భాజపా రికార్డు విజయం సాధించింది. వరుసగా ఏడోసారి విజయం సాధించి 37 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టింది. మొత్తం 182 స్థానాలకు 156 స్థానాల్లో గెలుపొంది సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 17, ఆప్ 5, ఇతరులు 4 స్థానాలను దక్కించుకున్నాయి.
2022 హిమాచల్‌ప్రదేశ్ ఎగ్జిట్ పోల్స్..
హిమాచల్‌ప్రదేశ్‌లో భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని ఎగ్జిట్‌పోల్స్ ముందే అంచనా వేశాయి. కానీ మొత్తం 68 స్థానాలకు గాను.. కాంగ్రెస్ పార్టీ 40 సీట్లను గెలుచుకుని అధికారం కైవసం చేసుకుంది. గుజరాత్లో ఘన విజయం సాధించిన భాజపా.. హిమాచల్‌లో మాత్రం 25 సీట్లకే పరిమితమైంది. ఆమ్ఆద్మీ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. కాగా, ముగ్గురు స్వతంత్రులు శాసనసభకు ఎన్నికయ్యారు.
అంతకుముందు ఇలా..
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి భాజపా అధికారాన్ని కైవసం చేసుకుంటుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. వాటి అంచనాలను నిజం చేస్తూ అధికార భాజపా స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. చెప్పినట్లుగానే సమాజ్ వాదీ పార్టీ రెండో స్థానానికి పరిమితం అయ్యింది. మరోవైపు, పంజాబ్‌లో ఓటర్లు మార్పు కోరుకున్నారని, ఈసారి అధికార కాంగ్రెస్‌కు గట్టి షాకిస్తూ.. ఆప్ వైపు మొగ్గనున్నారని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేశాయి. ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని పేర్కొన్నాయి. ఆ మాటలను నిజం చేస్తూ.. ఆప్ 92 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. అధికార కాంగ్రెస్ కేవలం 18 స్థానాలకే పరిమితం అయ్యింది.
ఉత్తరాఖండ్‌లో ఈ దఫా భాజపా, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. కానీ వాటి అంచనాలకు మించి కమలం పార్టీ రాణించింది. ఏకంగా 47 సీట్లను గెలుచుకుంది. మరోపైపు మణిపుర్లో ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచినప్పటికీ, సరైన సమయంలో చక్రం తిప్పి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన భాజపా.. ఈ దఫా కూడా సొంతంగా అధికార పీఠాన్ని చేజిక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్‌పోల్స్ పేర్కొన్నాయి. అదే విధంగా ఏకైక అతిపెద్ద పార్టీగా భాజపా అవతరించింది. ఎప్పట్లాగే గోవాలో హంగ్ తలెత్తే సంకేతాలు కనిపిస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్ లెక్క కట్టాయి. అయితే భాజపా మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచి.. స్వతంత్రుల సాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
బంగాల్ ఎన్నికల్లో..
2021 బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి స్వల్ప ఆధిక్యంతో.. భాజపాతో హోరాహోరీ పోరు ఉంటుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా టీఎంసీ అధిక సీట్లు సాధించింది. తమిళనాడు శాసనసభ పోరులో డీఎంకేకే విజయావకాశాలు ఉన్నాయని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అవే అంచనాలు నిజమై.. డీఎంకే భారీగా సీట్లు సాధించింది. కేరళలో మరోమారు ఎల్డీఎఫ్కు మెజారిటీ వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అంచనాలను నిజం చేస్తూ ఎల్డీఎఫ్ భారీ మెజారిటీతో మూడోసారి అధికారం చేపట్టింది. అసోంలో మరోమారు ఎన్డీఏకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అన్ని సర్వేలు తేల్చాయి. అదే విధంగా.. భాజపా నేతృత్వంలోని కూటమి మెజారిటీ సాధించింది. పుదుచ్చేరిలో అధికార మార్పిడి తప్పదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎన్డీఏ కూటమి మెజారిటీ సాధిస్తుందని తేల్చాయి. ఎగ్జిట్ పోల్స్ నిజం చేస్తూ.. ఫలితాలు వెలువడ్డాయి.