ఎన్నికలేవైనా, ఏ దేశమైనా ఒపీనియన్, ఎగ్జిట్ పోల్స్‌కు విశేష ప్రజాదరణ ఉంటుంది. కొన్నిసార్లు ఓటరు నాడి పట్టుకోవడంలో ఎగ్జిట్ పోల్స్ విఫలమైనా.. ఎక్కువ సందర్భాల్లో దాదాపుగా అవే ఫలితాలు వస్తున్నాయి. ఇందుకు తాజాగా జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలే సాక్ష్యంగా నిలిచాయి.
- బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి స్వల్ప ఆధిక్యంతో.. భాజపాతో హోరాహోరీ పోరు ఉంటుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా టీఎంసీ అధిక సీట్లు సాధించింది.
- తమిళనాడు శాసనసభ పోరులో డీఎంకేకే విజయావకాశాలు ఉన్నాయని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అవే అంచనాలు నిజమై.. డీఎంకే భారీగా సీట్లు సాధించింది.
- కేరళలో మరోమారు ఎల్డీఎఫ్కు మెజారిటీ వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అంచనాలను నిజం చేస్తూ ఎల్డీఎఫ్ భారీ మెజారిటీతో మూడోసారి అధికారం చేపట్టనుంది.
- అసోంలో మరోమారు ఎన్డీఏకే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అన్ని సర్వేలు తేల్చాయి. అదే విధంగా.. భాజపా నేతృత్వంలోని కూటమి మెజారిటీ సాధించింది.
- పుదుచ్చేరిలో ఈసారి అధికార మార్పిడి తప్పదని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎన్డీఏ కూటమి మెజారిటీ సాధిస్తుందని తేల్చాయి. ఎగ్జిట్ పోల్స్ నిజం చేస్తూ.. ఫలితాలు వెలువడ్డాయి.
ఇంతకుముందు...
2019 సార్వత్రికంలో అంచనాలకు మించి...
2019 సాధారణ ఎన్నికలు ముగిసిన రోజే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు విడుదలయ్యాయి. రెండోసారి భాజపా నేతృత్వంలోని ఎన్డీఏనే మరోమారు అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి పలు సర్వే సంస్థలు. సుమారు 300 పైచిలుకు సీట్లు సాధిస్తుందని తెలిపాయి. కానీ ఏబీపీ న్యూస్, నేత న్యూస్ ఎక్స్ మాత్రమే అధికార కూటమికి మెజారిటీ తగ్గిపోతుందని తెలిపాయి. ఎన్డీఏకు 267 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ చెప్పగా, న్యూస్ ఎక్స్ 242 వస్తాయని తెలిపింది.
అయితే... భాజపా అంచనాలకు మించి అధిక స్థానాలతో సొంతంగానే మెజార్టీ సాధించింది. ఎన్డీఏ 353 స్థానాలు గెల్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2014 కంటే 21 సీట్లు అధికంగా గెలిచి భాజపానే ఆధిపత్యం చెలాయించింది. యూపీఏ 90 సీట్లకే పరిమితమైంది.
2014 ఎగ్జిట్ పోల్స్..
2014లో మొత్తం 7 సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించగా అందులో న్యూస్-24 చాణక్య మాత్రమే దాదాపు కచ్చితమైన ఫలితాలను అంచనా వేయగలిగింది. ఎన్డీఏకు 340 సీట్లు వస్తాయని పేర్కొనగా.. అప్పటి ఎన్నికల్లో 336 సీట్లు వచ్చాయి. యూపీఏకు 70 సీట్లు అంచనా వేయగా 59 సీట్లు వచ్చాయి.
2004, 2009 విఫలం..
2004, 2009 ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయి. యూపీఏ, ఎన్డీఏల మధ్య గట్టి పోటీ ఉంటుందని చెప్పినప్పటికీ ఫలితాలు తారుమారయ్యాయి. రెండు సార్లూ యూపీఏ సునాయాసంగానే అధికారం చేజిక్కించుకుంది.