తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారతీయులూ.. జాగ్రత్త!'.. ఆ దేశంలోని వారికి కేంద్రం వార్నింగ్! - కెనడా విద్వేష నేరాలు

కెనడాలో ఓ వర్గం లక్ష్యంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. కేంద్రం ముందుజాగ్రత్తగా అక్కడి పౌరులను హెచ్చరించింది. కెనడాలో నివసిస్తున్న భారతీయులు, ఆ దేశానికి వెళ్లాలనుకుంటున్న భారత ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

MEA advisory for Indians in Canada
MEA advisory for Indians in Canada

By

Published : Sep 23, 2022, 5:09 PM IST

కెనడాలో విద్వేష నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ అక్కడి భారత పౌరులకు పలు సూచనలు చేసింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల కెనడాలో జరిగిన ద్వేషపూరిత ఘటన గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించామని విదేశాంగ శాఖ పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేయాలని కోరినట్లు తెలిపింది. సత్వరమే నిందితులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించింది. అయితే, ఇప్పటివరకు నిందితులను న్యాయస్థానం ఎదుటకు తీసుకురాలేకపోయారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకొని.. కెనడాలో ఉన్న భారత జాతీయులు, విద్యార్థులు, కెనడాకు ప్రయాణం చేయాలనుకుంటున్నవారు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది.

గతకొంతకాలంగా కెనడాలో విద్వేష నేరాలు గణనీయంగా పెరిగాయి. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, ఓ వర్గం లక్ష్యంగా హింస వంటివి ఆ దేశంలో పెచ్చుమీరాయి. ఇటీవలే ఖలిస్థానీ వేర్పాటువాదులు టొరంటోలోని శ్రీ స్వామినారాయణ్ మందిర్, విషు మందిర్​పై దాడి చేశారు. ఆలయ గోడలపై గ్రాఫిటీతో భారత వ్యతిరేక నినాదాలు రాశారు. ఈ నేపథ్యంలోనే.. కెనడాలోని హిందూ ఆలయాలు, ప్రార్థనా స్థలాలపై దాడులు పెరుగుతున్నాయని ఆ దేశ ఎంపీ చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. విధ్వంసాన్ని ఖండిస్తూ పార్లమెంట్​లో తన గళం విప్పారు.

ఈ నేపథ్యంలోనే విదేశాంగ శాఖ తాజా అడ్వైజరీ జారీ చేసింది. వీటితో పాటు అక్కడి భారతీయులకు పలు సూచనలు చేసింది. కెనడాలోని భారతీయులు.. ఒట్టొవాలో ఉన్న హైకమిషన్​లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపింది. లేదంటే వాంకోవర్, టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్​ను సంప్రదించాలని పేర్కొంది. మదద్ పోర్టల్ ద్వారా కూడా అధికారులను సంప్రదించవచ్చని తెలిపింది. దీని వల్ల హైకమిషన్​కు.. అక్కడి భారతీయులకు మధ్య సమన్వయం పెరుగుతుందని విదేశాంగ శాఖ వివరించింది. అత్యవసర సమయాల్లో సహాయం అందించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details