బిహార్‌లో అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉపఎన్నికల్లో (Bihar By Election News) ఆర్జేడీ పార్టీ భారీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రిగా నితీశ్‌ను బిహార్ ప్రజలు తిరస్కరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం తారాపుర్, కుశేశ్వర్‌స్థాన్ అసెంబ్లీ సెగ్మెంట్లకు శనివారం ఉపఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో.. సుదీర్ఘ విరామం తరువాత తిరిగి రాజకీయాల్లో అడుగుపెట్టడం గురించి మాట్లాడారు.
"ఆరేళ్ల తర్వాత రాజకీయంలో వచ్చాను. ఈ స్థాయిలో ప్రజల నుంచి మద్దతు లభించడం నిజంగా గొప్ప విషయం. నాకు చాలా ఆనందంగా ఉంది. కుశేశ్వర్ స్థాన్, తారాపుర్ అసెంబ్లీ సెగ్మెంట్లలో భారీ విజయాన్ని నమోదు చేస్తాం. ఈ ఎన్నికల్లో నితీశ్‌కు ప్రజలు బుద్ది చెప్తారు."
- లాలూ ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ అధినేత
కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. భాజపాకు ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో ఓ బలమైన పార్టీ కావాలని.. అది కాంగ్రెస్సే అని అన్నారు.
"సోనియా గాంధీ ఫోన్ చేసిన మాట వాస్తవమే. ఆమె నా మంచి కోరే వ్యక్తి. అందుకే ఫోన్ చేసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ స్థాయిలో భాజపాకు బలమైన ప్రత్యర్థి కావాలి. అనాది నుంచి కాంగ్రెస్ ఉంది. ఈ పార్టీనే బలమైనదని నేను విశ్వసిస్తున్నాను. మా మద్దతు హస్తం నేతలకు ఎప్పుడూ ఉంటుంది. అందుకే వచ్చే సాధారణ ఎన్నికల కోసమని.. విపక్షాల మద్దతు కూడగట్టేందుకు అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని సోనియాగాంధీకి సూచించాను. బహుశా నవంబర్‌లో ఈ సమావేశం జరగొచ్చు."