ఆర్టికల్ 370 పునరుద్ధరణ పేరుతో కశ్మీర్ ప్రజలను నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) తప్పుదోవ పట్టిస్తున్నాయని భాజపా సీనియర్ నేత సయ్యద్ షానవాజ్ హుస్సేన్ ఆరోపించారు. కశ్మీర్లో జిల్లా అభివృద్ధి ఎన్నికలు కొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఈటీవీ భారత్తో ముఖాముఖిలో కీలక వ్యాఖ్యలు చేశారు.
"ప్రజాక్షేమం కాదు స్వలాభం కోసమే గుప్కర్ గ్యాంగ్ ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 370, 35ఏతో ఎన్నో ఏళ్లుగా రాజకీయం చేశారు. ఇప్పుడు వాటిని పునరుద్ధరిస్తామనే పేరుతో నాటకాలు ఆడుతున్నారు. వాళ్ల పాచికలు భాజపా దగ్గర పారవు. ఆర్టికల్ 370 ముగిసిన అధ్యాయం. పునరుద్ధరణ అసాధ్యం."
- సయ్యద్ షానవాజ్ హుస్సేన్, భాజపా సీనియర్ నేత
జమ్ముకశ్మీర్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా గుప్కర్ కూటమి చైనాను సాయం అడుగుతోందని హుస్సేన్ ఆరోపించారు. కుటుంబ పాలనను నమ్మే వారి మాటలను ప్రజలు విశ్వసించడం లేదని చెప్పారు.