తమిళనాడులో తమ ప్రత్యర్థి డీఎంకేను.. హిందూ వ్యతిరేక లేక దేశ వ్యతిరేక పార్టీగానో పరిగణించట్లేదని భాజపా నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అలా ఆలోచించడం తప్పని, అది తమ పార్టీ భావన ఎంతమాత్రం కాదని పేర్కొన్నారు. ఇటీవల తమ పార్టీ నేతలు డీఎంకేపై పలు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు. అయితే.. రాష్ట్రంలో డీఎంకే అధికారంలోకి వస్తే రౌడీయిజం, అక్రమాలు పెరిగిపోతాయన్నారు. ఈ మేరకు ఈటీవీ భారత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై చెప్పుకొచ్చారు.
ఉనికి కోసం..
జాతీయ పార్టీలు ప్రాంతీయంగా ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయని కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏఐఏడీఎంకేతో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పటికీ.. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్డీఏ కోసమే..
ప్రతి పార్టీ అధికారంలోకి రావాలనుకుంటుందని.. భాజపా అందుకు మినహాయింపు ఏమీ కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉందని తెలిపారు. ఎన్డీఏ కూటమిని కాపాడుకునేందుకే 20 స్థానాల్లో పోటీ చేయడానికి భాజపా అంగీకరించిందన్నారు. ఒంటరిగా పోటీ చేయడమే దీర్ఘకాలంలో తమ పార్టీకి మంచిదని అభిప్రాయపడ్డారు.