తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పురుషుడిగా మారనున్న మాజీ సీఎం కుమార్తె.. లింగ మార్పిడి ఆపరేషన్​కు రెడీ! - buddhadeb bhattacharya padma bhushan

Buddhadeb Bhattacharya Daughter : బంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన.. లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకుని పురుషుడిగా మారాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఇదే విషయంపై న్యాయ, వైద్య నిపుణుల సలహాలు తీసుకున్నారు. తనకు సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకుంటానని సుచేతన చెప్పారు.

buddhadeb Bhattacharya daughter
buddhadeb Bhattacharya daughter

By

Published : Jun 22, 2023, 12:58 PM IST

Buddhadeb Bhattacharya Daughter : సీపీఎం కురువృద్ధుడు, బంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయంపై న్యాయ నిపుణులు, వైద్యులు, ఇతర నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఇటీవల LGBTQ ఉద్యమంలో సుచేతన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత నిర్ణయాలు తీసుకునేంత పెద్ద వయసు తనదని పేర్కొన్నారు.

'నేను వయసులో చాలా పెద్ద వ్యక్తిని. నా వయసు 41 సంవత్సరాలు. నాకు సంబంధించిన అన్ని నిర్ణయాలను నేనే తీసుకోగలను. నా శరీరంలోని మార్పులు నాకు తెలుసు కాబట్టి.. లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని పురుషుడిగా మారాలని నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నా తల్లిదండ్రులను ఈ వివాదంలోకి లాగొద్దు. నేను ముందు నుంచి మానసికంగా పురుషుడిలాగే ఉన్నాను. ఇప్పుడు శారీరకంగా కూడా పురుషుడిలా మారాలనుకుంటున్నాను. నా గురించి చిన్నప్పటి నుంచి నా తండ్రికి తెలుసు కాబట్టి.. లింగ మార్పిడి చికిత్సకు ఆయన ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నా.' అని సుచేతన తెలిపారు.

లింగమార్పిడి చికిత్స చేయించుకుని పురుషుడిగా మారాలనుకోవడం తన సొంత నిర్ణయమని.. దీనిపై ఎవరూ రాద్ధాంతం చేయవద్దని సుచేతన కోరారు. తన జీవితానికి సంబంధించిన అన్ని నిర్ణయాల లాగానే మహిళ నుంచి పురుషుడిగా మారాలనే నిర్ణయాన్ని తానే స్వయంగా తీసుకున్నట్లు ఆమె తెలిపారు. రోజూ ట్రాన్స్‌ మ్యాన్‌గా తాను ఎదుర్కొంటున్న సామాజిక వేధింపులను తట్టుకునేందుకు లింగ మార్పిడి ఆపరేషన్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే తాను మానసికంగా పురుషుడినని భావిస్తున్నానని.. ఈ లింగ మార్పిడి ఆపరేషన్ పూర్తి అయితే శారీరకంగా కూడా పురుషుడి లాగే ఉంటానని సుచేతన స్పష్టం చేశారు.
బంగాల్ ముఖ్యమంత్రిగా బుద్ధదేవ్ భట్టాచార్య 2001 నుంచి 2011 వరకు పనిచేశారు. ఈయన సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు.

మా బావే సీఎం.. అయినా..
కొన్నాళ్ల క్రితం బంగాల్​ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్​ భట్టాచార్య మరదలు ఇరా బసు రోడ్లపై భిక్షాటన చేస్తూ కనిపించారు. ఈ వార్త నెట్టింట తెగ వైరల్​ అయిన అనంతరం.. అధికారులు ఆమెను కోల్​కతాలోని లుంబినీ ఆసుపత్రిలో చేర్పించారు. కొద్ది రోజులు ఆసుపత్రిలో ఉంచాక తిరిగి ఆమెను కర్దాలోని తన సొంతింటికి తరలించారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని ఓ పాఠశాలలో పనిచేసి పదవీ విరమణ పొందిన సమయంలో బంగాల్​ సీఎంగా బుద్ధదేవ్​ ఉన్నట్లు ఇరా బసు తెలిపారు. అయినప్పటికీ తన పింఛను సమస్యకు పరిష్కారం దొరకలేదని పేర్కొన్నారు. ఈ కారణంగా తన సోదరి మీరా భట్టాచార్య దంపతులపై కోపం పెంచుకోలేదని చెప్పారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ABOUT THE AUTHOR

...view details