EX Minister Balineni: వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులు జగన్ వెంటే నడిచేందుకు మంత్రి పదవినీ వదులుకున్నారు. నిన్నా మొన్నటి వరకు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన బాలినేని శ్రీనివాసరెడ్డి.. మంత్రి పదవి కోల్పోయిన నాటి నుంచీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన పరిణామాలూ ఆయనకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఆయన మూడు జిల్లాల సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నానంటూ అధినాయకత్వానికి లేఖ రాయడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. అనారోగ్యం, సొంత నియోజకవర్గం ఒంగోలుపై మరింత దృష్టి సారించేందుకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు.
Balineni: వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకోనున్న మాజీమంత్రి బాలినేని - ఏపీ తాజా వార్తలు
10:59 April 29
ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా బాలినేని
ప్రకాశం జిల్లా రాజకీయాలనే శాసించిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రాభవం రోజురోజుకు మసకబారుతోంది. వైఎస్ కుటుంబానికి దగ్గరి బంధువు కావడంతోపాటు.. మంత్రి పదవి సైతం వదులుకుని జగన్ వెంట నడవడంతో వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచీ జిల్లాలో బాలినేని పార్టీకి పెద్దదిక్కుగా ఉన్నారు. పార్టీ అధికారంలోకి రావడం.. వెనువెంటనే మళ్లీ మంత్రి పదవి చేపట్టడంతో ఇటు జిల్లాలోనూ అటు పార్టీలోనూ ఆయన చక్రం తిప్పారు. జిల్లాలో పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు. ఈక్రమంలోనే మంత్రివర్గ విస్తరణలో సీఎం జగన్ బాలినేనిని మంత్రివర్గం నుంచి తప్పించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అందరినీ తొలగించి కొత్తవారికి ఇచ్చి ఉంటే తానేమీ బాధపడేవాడిని కాదని.. కొంతమందిని కొనసాగించి తనను తొలగించడమేంటంటూ ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. పైగా జిల్లాలో ఆదిమూలపు సురేశ్‌ను కొనసాగించడంపైనా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
మంత్రి పదవి కోల్పోయిన నాటి నుంచి పార్టీలోనూ జిల్లాలోనూ వాసు పరపతి కొంత తగ్గిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం మార్కాపురం పర్యటన సందర్భంగా హెలీప్యాడ్ వద్దకు బాలినేని వాహనాన్ని.. పోలీసులు అనుమంతించలేదు. దీనిపై తీవ్ర ఆగ్రహం చెందిన ఆయన సీఎం సభకు హాజరుకాకుండానే వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. సీఎం జగన్ నేరుగా ఫోన్ చేసి సర్దిచెప్పడంతో మళ్లీ తిరిగి వచ్చారు. మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రాపకం కోసమే బాలినేనిని అవమానించారని ఆయన వర్గీయులు మండిపడ్డారు. ఇటీవల జరిగిన డీఎస్పీల బదిలీల్లో ఒంగోలు డీఎస్పీగా అశోక్‌వర్ధన్‌ను నియమించే విషయంలో కనీసం తనను నామమాత్రంగానైనా సంప్రదించలేదని బాలినేని అసంతృప్తికి గురయ్యారు. బాలినేని వియ్యంకుడు భాస్కర్‌రెడ్డి విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యవహారం కూడా కొంత ఇబ్బందులు తెచ్చిపెట్టింది. జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ భాస్కర్‌రెడ్డిపైనా, బాలినేనిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై బాలినేని స్పందించినా అప్పటికే పార్టీలో కొంత డ్యామేజీ జరిగిపోయిందని అంటున్నారు. వీటిన్నింటి వెనుక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పాత్ర ఉందని బాలినేని అనుమానిస్తున్నారు.
జిల్లాలో వైసీపీ నేతలతోనూ బాలినేనికి పొసగడం లేదు. మంత్రి ఆదిమూలపు సురేశ్ వర్గానికి, బాలినేని వర్గానికి మధ్య విబేధాలు పొడచూపాయి. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డితోనూ వాసుకు పొసగడం లేదు. కొందరు ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు తన మాటకు గౌరవం ఇవ్వడం లేదని బాలినేని అసంతృప్తిగా ఉన్నారు. పర్చూర్ వైసీపీ ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ నియామకాన్నీ బాలినేని వ్యతిరేకించారు. ఆ నియోజకర్గంలో ఆమంచి వ్యతిరేకీయులంతా బాలినేని వద్దకు వచ్చి ఆమంచిపై ఫిర్యాదులు చేస్తుండగా.. ఆమంచి వర్గీయులు బాలినేనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి సైతం తాను ఏ ప్రతిపాదన తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని.. బాలినేని తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తనకు విలువలేని చోట పార్టీ పదవుల్లో కొనసాగడం ఇష్టం లేదని ఆయన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో పూర్తికాలం ఒంగోలు నియోజకవర్గానికే కేటాయించేందుకు సమన్వయకర్త పదవి వదులుకుంటున్నట్లు ఆయన చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలో పార్టీ గొడవులు తీవ్రస్థాయికి చేరుకోవడం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, నారాయణస్వామి మధ్య వర్గపోరు ఆయనకు విసుకు తెప్పించాయని.. వారిని ఒకతాటిపైకి తీసుకొచ్చే పరిస్థితులు లేకపోవడం వల్లే పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం.
ఇవీ చదవండి: