Supreme Court EWS Quota: ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించడమంటే.. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీం కోర్టుకు కొందరు న్యాయవాదులు నివేదించారు. రిజర్వేషన్లపై 50%గా ఉండాల్సిన పరిమితిని అది అతిక్రమిస్తోందని, క్రీమీలేయర్ విధానాన్ని ఓడిస్తోందని పేర్కొన్నారు. ఆ కోటా నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను మినహాయిస్తుండటాన్నీ తప్పుపట్టారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కు వీలుగా కేంద్రం తీసుకొచ్చిన 103వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధతను సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ జె.బి.పార్దీవాలాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం పిటిషనర్ల తరఫు న్యాయవాదుల వాదనలను మంగళవారం ఆలకించింది.
"రిజర్వేషన్ అనే విధానాన్ని నాశనం చేసేందుకు మోసపూరితంగా, దొడ్డిదారిన చేస్తున్న ప్రయత్నమే ఈడబ్ల్యూఎస్ కోటా. విద్యాపరంగా, సామాజికంగా వెనకబడిన పౌరులు, ఎస్సీలు, ఎస్టీలు ఆర్థికంగా బలహీనులైనప్పటికీ.. ఈ కోటాలో రిజర్వేషన్ ప్రయోజనాన్ని పొందలేరు. అగ్రవర్ణాల్లోని పేదలకు మాత్రమే లబ్ధి చేకూరేలా అందులో ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు. అది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. 103వ రాజ్యాంగ సవరణను రాజ్యాంగంపై దాడిగానే చూడాలి. అది రాజ్యాంగాన్ని గుండెలో పొడిచింది" అని సీనియర్ న్యాయవాది మోహన్ గోపాల్ వాదించారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద లబ్ధి పొందేందుకు వార్షిక గరిష్ఠ ఆదాయ పరిమితిని రూ.8 లక్షలుగా నిర్ణయించడాన్నీ తప్పుపట్టారు. ఆ లెక్కన నెలకు రూ.66 వేల ఆదాయమున్న కుటుంబాలకూ ప్రయోజనం కలుగుతుందని గుర్తుచేశారు.