Famous Temples in Hyderabad :దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగ్గ పట్టణాలలో హైదరాబాద్ ఒకటి. ఆర్థిక, సామాజిక, రాజకీయం, పర్యాటకం, పురాతన ప్యాలెస్‌లు, కోటలు, రుచికరమైన బిరియానీ, హలీంలకు పేరెన్నిక గల నగరం హైదరాబాద్. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ నగరంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. సాధారణంగా హైదరాబాద్ అంటే.. చార్మినార్(Charminar), గోల్కొండ, ట్యాంక్ బండ్, సాలార్ జంగ్ మ్యూజియం.. లాంటివి గుర్తొస్తాయి.
అయితే, ఇవి మాత్రమే కాకుండా భాగ్యనగరంలో వందల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన దేవాలయాలతో పాటు ఇటీవల ఆధునిక వాస్తు శైలిలో ఏర్పాటు చేసిన చేసిన ప్రముఖ దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇవి ఆధ్యాత్మిక క్షేత్రాలుగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా ప్రాచూర్యం పొందాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్(Hyderabad)లో అత్యంత ప్రాముఖ్యం కలిగిన 7 ప్రముఖ దేవాలయాల జాబితాను మీ ముందుకు తీసుకొచ్చాం. అవేంటో ఇప్పుడు చూద్దాం..
1. జగన్నాథ దేవాలయం(Jagannath Temple) :శ్రీకృష్ణుని రూపంగా భావించే జగన్నాథునికి అంకితం చేసిన జగన్నాథ దేవాలయం హైదరాబాద్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటి. దీనిని నగరం ప్రజలతో పాటు తెలంగాణలో నివసించే ఒరిస్సాకు చెందిన వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు కలిసి 2009లో నిర్మించారు. ప్రధాన దైవం జగన్నాథుడే అయినా ఇక్కడ సుభద్రా దేవి, శ్రీకృష్ణుని అన్నయ్య అయిన బలరాముని విగ్రహాలను కూడా చూడవచ్చు. పూరిలోని ఐకానిక్ జగన్నాథ ఆలయాన్ని పోలి ఉండే ఈ ఆలయం తెలంగాణ ప్రముఖ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.
టైమింగ్స్ : ఉదయం 6:00 నుంచి 11:00 వరకు, సాయంత్రం 5:00 నుంచి రాత్రి 9:00 వరకు
లొకేషన్ : భవానీ నగర్, బంజారాహిల్స్, హైదరాబాద్
సమీప బస్ స్టాప్ : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ బస్ స్టాప్
2. రత్నాలయం దేవాలయం(Ratnalayam Temple) : హైదరాబాద్‌లో మీరు సందర్శించాల్సిన ప్రముఖ దేవాలయాలలో రత్నాలయం ఒకటిగా చెప్పుకోవచ్చు. ఈ దేవాలయంలో వేంకటేశ్వరుడు, ఆండాళ్ దేవితో పాటు పద్మావతి దేవిని భక్తులు పూజిస్తారు. ఇక్కడ మీరు తప్పక చూడాల్సినది విష్ణువు తన భార్యలతో కలిసి ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటున్నట్లు కొలువై ఉన్న ఫౌంటెన్. శంఖు, చక్రం, నామంతో సహా వైష్ణవ చిహ్నాలను వర్ణించే మరికొన్ని ఫౌంటైన్‌లు ఇక్కడ ఉన్నాయి. మీరు ఆలయ సెంట్రల్ హాల్‌లో ఇతర భక్తులతో కలిసి విష్ణు సహస్రనామం జపించవచ్చు లేదా బయట అందమైన తోటలలో అలా కాసేపు సేద తీరవచ్చు. విషపూరిత పాము కాలియాపై విష్ణువు నృత్య భంగిమలో ఉన్న అద్భుతమైన శిల్పం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఓపెనింగ్ టైమ్స్ :ఉదయం 6:00 నుంచి 12:00 వరకు, సాయంత్రం 4:00 నుంచి 8:00 వరకు (సోమవారం-శుక్రవారం)
ఉదయం 6:00 నుంచి 1:00 వరకు, సాయంత్రం 4:00 నుంచి 9:00 వరకు (వీకెండ్స్, సెలవు రోజుల్లో)
లొకేషన్ : అలియాబాద్, రంగారెడ్డి
సమీప బస్ స్టాప్ :అలియాబాద్ X రోడ్ బస్ స్టాప్
3. బిర్లా మందిర్(Birla Mandir) :హైదరాబాద్‌లోని పురాతన దేవాలయాలలో ఇది ఒకటి. ఈ లార్డ్ వెంకటేశ్వర ఆలయం నౌబత్ పహాడ్‌లో 280 అడుగుల ఎత్తులో ఉంది. దీనిని 1976లో రామకృష్ణ మిషన్‌కు సంబంధించిన స్వామి రంగనాథానంద ప్రారంభించారు. మెరిసే తెల్లటి పాలరాయితో, గుర్బానీ, ఇతర మత బోధనల శ్లోకాలతో గోడలపై చెక్కబడిన ఈ ఆలయం 13 ఎకరాలలో విస్తరించి ఉంది. 11 అడుగుల పొడవు గ్రానైట్‌తో చేసిన విష్ణుమూర్తితో సహా అందమైన రాతి శిల్పాలను చూడటానికి చాలా మంది పర్యాటకులు ఇక్కడకు వస్తారు. రాతితో చెక్కిన తామర పువ్వు, గొడుగు కూడా విగ్రహం గొప్పతనాన్ని తెలియజేస్తాయి.
టైమింగ్స్:ఉదయం 7:00 నుంచి 12:00 వరకు, మధ్యాహ్నం 3:00 నుంచి 9:00 వరకు
లొకేషన్ :హిల్ ఫోర్ట్ రోడ్, అంబేడ్కర్ కాలనీ, ఖైరతాబాద్, హైదరాబాద్
సమీప బస్ స్టాప్ :ఆంధ్రా బ్యాంక్ బస్ స్టాప్
4. ఇస్కాన్ టెంపుల్(ISKCON Temple) :ఇస్కాన్ టెంపుల్స్ ఏ నగరంలో ఉన్న పర్యాటక కోణానికి ఎంతో శోభను తీసుకొస్తాయి. హైదరాబాద్‌లో కూడా అలాంటి టెంపుల్ ఒకటి ఉంటుంది. శ్రీకృష్ణుడు, రాధల లీలలను వర్ణించే శిల్పాలు ఈ టెంపుల్లో ఉన్నాయి. దీనినే శ్రీ శ్రీ రాధా మదన మోహన ఆలయం అని కూడా పిలుస్తారు. ఇస్కాన్ ఆలయం ఏడాది పొడవునా అనేక సాంస్కృతిక, విద్యా, సామాజిక, ఆధ్యాత్మిక కార్యకలాపాలకు ఆతిథ్యం ఇస్తుంది. క్యాసెట్ లైబ్రరీ, వేద లైబ్రరీ ఈ ఆలయంలో భాగంగా ఉన్నాయి. ఇక్కడ మీరు హిందూ గ్రంథాలైన భాగవతం, సంస్కృతం, భగవద్గీత, ఉపనిషత్తులలో రోజువారీ తరగతులకు కూడా హాజరు కావచ్చు.