తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఎంల మార్పుపై గడ్కరీ కీలక వ్యాఖ్యలు

దేశంలో రాజకీయ నాయకులెవరూ ఆనందంగా లేరని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పుకొచ్చారు. మంత్రి పదవి రాలేదని ఎమ్మెల్యే, సీఎం పీఠం దక్కలేదని మంత్రులు అసంతృప్తిగా ఉన్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భాజపా తరచూ సీఎంలు మార్చుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపైనా పరోక్షంగా ఛలోక్తి విసిరారు.

gadkari
గడ్కరీ

By

Published : Sep 14, 2021, 1:34 PM IST

Updated : Sep 14, 2021, 2:09 PM IST

దేశంలోని రాజకీయ నాయకుల పరిస్థితిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు అసంతృప్తితోనే ఉన్నారని చెప్పారు. మంత్రి పదవి రాలేదని ఎమ్మెల్యేలు బాధపడుతుంటే.. మంత్రులుగా ఉన్నవారు తమకు సరైన శాఖలు లేవని చింతిస్తున్నారని చెప్పారు. ఇక.. మంచి శాఖలు దక్కిన మంత్రులు.. సీఎం పదవి రాలేదని అసంతృప్తిగా ఉన్నారని గడ్కరీ (Nitin Gadkari news) చెప్పుకొచ్చారు. చివరకు ముఖ్యమంత్రులు.. తాము ఎంతకాలం పదవిలో ఉంటామో తెలియక ఆందోళన చెందుతున్నారని అన్నారు.

'పార్లమెంటరీ వ్యవస్థ, ప్రజల అంచనాలు' అనే అంశంపై రాజస్థాన్ అసెంబ్లీలో (Gadkari Rajasthan) జరిగిన సెమినార్​లో ఈ వ్యాఖ్యలు చేశారు గడ్కరీ. ఇటీవల పలు రాష్ట్రాల్లో భాజపా తన ముఖ్యమంత్రులను (BJP CM change) మార్చుతున్న నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి

"సమస్యలు అందరికీ ఉన్నాయి. పార్టీలో, పార్టీ బయట, నియోజకవర్గంలో, కుటుంబంలో.. అన్ని చోట్లా సమస్యలు ఉన్నాయి. ఎవరికి లేవు సమస్యలు? మీలో ఎవరు సంతోషంగా ఉన్నారని ఒకరు అడిగితే ఎవరూ చెయ్యి ఎత్తలేదు. ఎందుకంటే, ఎమ్మెల్యేకు మంత్రి కాలేదని బాధ. తనకు మంచి శాఖ రాలేదని మంత్రికి బాధ. మంచి శాఖ వచ్చిన వారికి.. ముఖ్యమంత్రి కాలేదని బాధ. ముఖ్యమంత్రికి.. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో భరోసా లేకపోవడం బాధ."

-నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రి

మరోవైపు, రాజకీయ నాయకుల గురించి శరద్ జోషి (Sharad Joshi) అనే కవి రాసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు గడ్కరీ. 'రాష్ట్రంలో పనిచేసేందుకు అనుగుణంగా లేని వ్యక్తులను దిల్లీకి పంపిస్తారు. దిల్లీకి సూట్ కాని నేతలను గవర్నర్​లుగా నియమిస్తారు. గవర్నర్​లుగా నియామకం కాని వారిని రాయబారులుగా పంపిస్తారు. ఇది ప్రతి రాజకీయ పార్టీలో జరిగేదే' అని చెప్పుకొచ్చారు.

'రైతులు పెట్రోల్ తయారు చేయొచ్చు'

ఇదే కార్యక్రమంలో ఇతర అంశాలపైనా మాట్లాడారు గడ్కరీ. రైతులు వరి, గోధుమలు పండించడమే కాకుండా పెట్రోల్, డీజిల్ సైతం తయారు చేయొవచ్చని అన్నారు. త్వరలో కేంద్రం 'ఫ్లెక్స్ ఇంజిన్' విధానాన్ని ప్రవేశపెట్టనుందని తెలిపారు. వాహనాలను ఇథనాల్ లేని ఇంధనంతో నడపవచ్చని చెప్పారు. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, ఛత్తీస్​గఢ్, ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాలు తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయని.. సూపర్ ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా దీన్ని పరిష్కరించవచ్చని తెలిపారు. గ్రామాల్లోని నీటిని గ్రామాల్లో, నగరాల్లో నీటిని నగరాల్లోనే సంరక్షించే ఏర్పాట్లు చేయాలని అన్నారు.

జల వనరుల శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు రాష్ట్రాల మధ్య ఉన్న ఏళ్లనాటి నీటి సమస్యలను పరిష్కరించినట్లు చెప్పారు. ప్రస్తుతం, పంజాబ్-హరియాణా రాష్ట్రాలు వారిలో వారు తగాదా పడుతుంటే... మూడు నదుల నీళ్లు పాకిస్థాన్​కు వెళ్లిపోతున్నాయని చెప్పారు.

ఇదీ చదవండి:

యోగి సర్కార్​పై మోదీ ప్రశంసల జల్లు

ఎల్​జేపీ ఎంపీ పాసవాన్​పై రేప్​ కేసు

Last Updated : Sep 14, 2021, 2:09 PM IST

ABOUT THE AUTHOR

...view details