తాలిబన్ల హస్తగతమైన(Taliban takeover) తర్వాత అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు (India Kabul evacuation) కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. కాబుల్ నుంచి బయలుదేరిన భారత వైమానిక దళానికి చెందిన సీ-17 విమానం.. భారత్‌కు చేరుకుంది. దిల్లీకి సమీపంలోని హిండన్ వైమానిక స్థావరంలో(Hindon Airbase) ఈ విమానం ల్యాండ్ అయింది. విమానంలో మొత్తం 168మంది ప్రయాణికులు ఉండగా.. 107 మంది భారతీయులు, 23 మంది అఫ్గాన్ సిక్కులు, హిందువులు ఉన్నారు. వీరిలో ఒక శిశువు పాస్‌పోర్టు లేకుండానే భారత్‌లో అడుగుపెట్టింది. అఫ్గానిస్థాన్ చట్టసభ సభ్యులు అనార్కలి హోనర్యార్, నరేందర్ సింగ్ ఖాస్లా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు.
మరో 87మంది భారతీయులు, ఇద్దరు నేపాలీలను భారత వైమానిక దళానికి చెందిన సైనిక విమానంలో తజకిస్థాన్ తరలించగా.. అక్కడి నుంచి ఆదివారం దిల్లీకి తీసుకువచ్చారు. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో వీరిని స్వదేశానికి చేర్చారు.
అఫ్గాన్‌లోని విదేశీ కంపెనీల్లో పనిచేస్తున్న మరో 135 మంది భారతీయ ఉద్యోగులను.. యూఎస్, నాటో విమానాల ద్వారా తొలుత దోహాకు తరలించారు. వారిని ఆదివారం భారత్‌కు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
ప్రయాణికుల భావోద్వేగం..
భారత్ చేరుకున్న అనంతరం ప్రయాణికులు భావోద్వేగానికి లోనయ్యారు. అఫ్గాన్‌లో పరిస్థితుల పట్ల విచారం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల కష్టం వృథా అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబంతో కలిసి వచ్చానని తెలిపిన ఓ ప్రయాణికురాలు.. తాలిబన్లు ఆమె ఇంటికి నిప్పంటించినట్లు చెప్పారు. సాయం చేసేందుకు వచ్చిన భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:Taliban Afghanistan: అంతా నాశనమైంది.. అఫ్గాన్ ఎంపీ కంటతడి
ఏడుపు వచ్చేస్తోంది: ఎంపీ