తాలిబన్ల(Taliban) వశమైన అఫ్గానిస్థాన్(Afghanistan news) రాజధాని కాబుల్‌లో.. రోజురోజుకీ భద్రతా పరిస్థితులు క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 300 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు(Indian evacuation from Afghanistan) అధికారులు ఏర్పాట్లు చేశారు. భారత వైమానిక దళానికి చెందిన మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 87 మంది భారతీయులను ఇవాళ దిల్లీకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. అయితే.. ఈ ఎయిర్‌క్రాఫ్ట్ ఇండియాకు బయలుదేరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పష్టం చేశారు.
"అఫ్గాన్ నుంచి భారతీయులను సురక్షితంగా తీసుకువస్తున్నాం. ఏఐ 1956 విమానం 87 మంది భారతీయులతో తజకిస్థాన్ నుంచి బయలుదేరింది. ఇందులో ఇద్దరు నేపాలీలు కూడా ఉన్నారు. మరింత మందిని భారత్‌కు సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం."
--అరిందమ్ బాగ్చి, విదేశాంగ అధికార ప్రతినిధి.
మరోవైపు కాబుల్ నుంచి దోహాకు తరలించిన 135 మంది భారతీయులను.. స్వదేశానికి తీసుకువస్తున్నట్లు కతార్‌లోని భారత దౌత్యకార్యాలయం ప్రకటన చేయడం గమనార్హం. యూఎస్, నాటో దళాల సాయంతో వీరిని దోహాకు తరలించినట్లు భారత అధికారులు పేర్కొన్నారు.