రాళ్లు పలికించే సుమధుర రాగాలివి! ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాంద్రా జిల్లాలో ఆశ్చర్యం కలిగించే కొండ ఒకటుంది. దాని పేరు బంబేశ్వర్. ఆ కొండపై రాళ్లను మరో రాయితో కొట్టినప్పడు సంగీతం వినిపిస్తుంది. ఆ రాళ్లు పలికే స్వరాలు వింటే అద్భుతంగా అనిపిస్తుంది. ఈ కొండ గుహలో ఓ పురాతన శివాలయం కూడా ఉంది. మహర్షి బాందేవ్ ఆశ్రమం ఇక్కడే ఉండేదని చెప్తారు స్థానికులు.
"గూయిన్యా పేరుతో ఈ కొండ ప్రసిద్ధి. వనవాసం సమయంలో శ్రీరాముడు మహర్షి బాందేవ్‌ను కలిసేందుకు ఇక్కడికి వచ్చారు. ఆయన పాదం మోపిన రాళ్లు...మృదువుగా మారిపోయి సంగీతం పలికించాయి. ఈ రాళ్లన్నీ రామాయణం కాలం కంటే మునుపటివే."
--పుతిన్ తివారీ, పండితుడు
రాముడి మహత్యం వల్లే..!
ప్రతి మనిషిలోనూ, ప్రతి అణువులోనూ రామచంద్రుడుంటాడు. రాళ్లే ఆ భగవానుణ్ని స్మరిస్తున్నప్పుడు.. ప్రతిఒక్కరూ ఆయన్ను పూజించాల్సిన అవసరముందని అంటున్నారు భక్తులు.
"బండపై చిన్న రాయితో కొట్టాను. అద్భుతమైన శబ్దం వచ్చింది. రామచంద్రుడి మహత్యం వల్లే ఈ రాళ్ల నుంచి సంగీతం పలుకుతోంది."
---అరవింద్ సింగ్, భక్తుడు.
"ఇక్కడనున్న విగ్రహాన్ని ఎవరూ చెక్కలేదు. స్వయంగా వెలిసింది. బాందేవ్ కూడా చిత్రకూటం అంత పవిత్రమైనది."
--మనీషా శ్రీవాస్తవ్.
కణాల మధ్య దూరం వల్లే!
ఈ అద్భుతం వెనక ఉన్న శాస్త్రీయమైన కారణాలపై పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు. బంబేశ్వర్ రాళ్ల నుంచి సంగీతం పుట్టడం వెనక కారణమేంటో వివరిస్తున్నారు జేఎన్ కళాశాల భూగోళశాస్త్ర విభాగాధిపతి పీయూష్ మిశ్రా.
"ఆ రాళ్లు రూపుదిద్దుకునే సమయంలో కణాల మధ్య దూరం ఏర్పడి ఉంటుంది. రాళ్లు అణువులతో తయారవుతాయి కాబట్టి, లేజర్ సాంకేతికత వినియోగించి, వాటిని పరీక్షించినప్పుడు పూర్తి సమాచారం తెలుసుకోగలిగాం. అణువుల మధ్య ఉండే ఆ దూరమే సంగీతం రావడానికి కారణం."
---డా.పీయూష్ మిశ్రా, జేఎన్ కళాశాల విభాగాధిపతి.
నమ్మకాన్ని, సైన్స్‌ను ప్రకృతే సమతూకం చేస్తుంది. ప్రకృతి సృష్టించే ప్రతిదీ అందమైనదే, అద్భుతమైనదే. బంబేశ్వర్ కొండ కూడా వాటిలో ఒకటి. రాళ్ల నుంచి సంగీతం రావడానికి సరైన కారణాలేంటో చెప్పలేకపోయినా.. సైన్స్ కన్నా నమ్మకమే ప్రజలను ఎక్కువ ప్రభావితం చేస్తోంది.
ఇదీ చూడండి:వాడిపోయిన పూలే- కానీ వికసిస్తాయ్!