తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చరిత్రలో కప్పడ్​ బీచ్​ ప్రత్యేకం- ప్రకృతి శోభితం - కేరళ కప్పడ్​ బీచ్ అందాలు

కేరళలోని కప్పడ్​ బీచ్​.. చరిత్రలో దీనికి ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ.. కొంతకాలం క్రితం వరకు మనుషులెవరూ ప్రవేశించడానికి వీల్లేకుండా ఉండేది. కానీ, అధికారులు ఈ బీచ్​ను ప్రస్తుతం ఓ పర్యటక ప్రాంతంగా మలిచారు. పర్యావరణ హిత బీచ్​గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ తీరం.. సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతోంది.

kerala kappad beach
కప్పడ్​ తీరంలో పర్యావరణ హిత సొగసులు!​

By

Published : Mar 6, 2021, 10:55 AM IST

కప్పడ్​ తీరంలో పర్యావరణ హిత సొగసులు!​

పోర్చుగల్ నావికుడు వాస్కోడిగామా 1498లో కేరళ, కోజికోడ్‌ జిల్లాలోని కప్పడ్‌ తీరంలో దిగాడు. భారతదేశంలోకి విదేశీయుల చొరబాట్లకు బీజం పడింది అప్పుడే. అలా చరిత్రలో కప్పడ్‌ బీచ్‌కు ఓ స్థానముంది. ఒకప్పుడు మనుషులెవరూ ప్రవేశించడానికి వీల్లేకుండా ఉండే ఈ బీచ్‌ను.. ప్రస్తుతం ఓ పర్యాటక ప్రాంతంగా మలిచారు. చెమన్‌చెర్రీ పంచాయతీలో ఉన్న కప్పడ్‌ బీచ్ సాయంత్రాలు.. సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. పర్యావరణహిత బీచ్‌లకు అంతర్జాతీయ స్థాయిలో వచ్చే గుర్తింపు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ 2021లో వచ్చిన తర్వాత కప్పడ్ పేరు మారుమోగిపోయింది. కేరళలో ఉన్న 8 బీచ్‌లలో ఈ గుర్తింపు పొందిన ఏకైక బీచ్ కప్పడ్. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.99 లక్షలతో గ్రీన్ కార్పెట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది.

"కప్పడ్ ప్రాంతంలో పెద్దఎత్తున అభివృద్ధి జరుగుతోంది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌తో పనులు వేగంగా సాగుతున్నాయి. దేశంలో కప్పడ్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు వచ్చింది. చెమన్‌చెర్రీ ప్రజలకు కప్పడ్ ఓ గర్వకారణం. కప్పడ్ పరిసరాల్లో అభివృద్ధి పనులతో భారీ మార్పు తేగలిగాం."

-సత్తి కిళక్కయిల్, పంచాయతీ ప్రెసిడెంట్

పర్యటకులను ఆకట్టుకునేందుకు..

కప్పడ్‌కు పర్యటకుల తాకిడి పెంచేందుకు చర్యలు చేపట్టారు. పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా బీచ్ సుందరీకరణ పనులు చేశారు. కాంక్రీటు నిర్మాణాలను పూర్తిగా పక్కనపెట్టి, దిల్లీ నుంచి తెప్పించిన వెదురు బొంగులనే నిర్మాణంలో వినియోగించారు. బీచ్ నిర్వహణ, పారిశుద్ధ్యం కోసం 30 మంది సిబ్బందిని నియమించారు. పెద్దలకు రూ.25, పిల్లలకు రూ.10 ప్రవేశ రుసుం నిర్ణయించారు. పదేళ్లలోపు చిన్నారులకు ప్రవేశం ఉచితం. ఈ రుసుమునూ తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు స్థానికులు.

"ప్రస్తుతం సిబ్బంది వేతనాల కోసం ఆరేడు లక్షల ఖర్చు వస్తోంది. ఈ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే మా ప్రధాన ఉద్దేశం. పర్యటకులు వచ్చినప్పుడు ప్రవేశ రుసుం చెల్లించి, లోపలికి వెళ్తారు. వాళ్ల నుంచి చాలా తక్కువ ఫీజు వసూలు చేయాలని నిశ్చయించుకున్నాం. స్థానికులైన చెమన్‌చెర్రీ ప్రజల నుంచి ఫీజు వసూలు చేయడం సరైంది కాదని అధికారులకూ చెప్పాం. రుసుములు ఇంకా తగ్గించాలని కోరుతూ మరోసారి అధికారులను కలవాలనుకుంటున్నాం. ఫీజుల ద్వారానే ఖర్చులు భరించేలా జిల్లా పర్యటక ప్రచార సంఘం నిబంధనలు తయారుచేసింది."

-సత్తి కిళక్కయిల్, చెమన్‌చెర్రీ పంచాయతీ ప్రెసిడెంట్

"కొత్తగా చాలామంది వస్తున్నారు. కొవిడ్-19 వ్యాప్తి ప్రారంభ దశలో కప్పడ్ బీచ్‌కు ఒక్కరు కూడా వచ్చేవారు కాదు."

-సెక్యూరిటీ సిబ్బంది

కప్పడ్ బీచ్ రూపురేఖలు పూర్తిగా మార్చేసిన తర్వాత.. బీచ్ ఆవరణలో వాస్కోడిగామా పేరు మీద ఓ రాతిఫలకం ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఆ ప్రాంతమంతా పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉండేది.

"కప్పడ్ బీచ్‌ ఏమాత్రం మునుపటిలా లేదు. బాగా సుందరీకరించారు. అలంకరించారు. పూర్తిగా మారిపోయింది. ప్రవేశ రుసుం విధానం తేవడం మంచిదైందని అనుకుంటున్నా. అలా అయితేనే సిబ్బందికి వేతనాలిచ్చేందుకు ఆదాయం వస్తుంది కదా."

-పర్యటకుడు

ఇదీ చూడండి:'పట్టు'దలతో మహిళల సిరుల పంట

ABOUT THE AUTHOR

...view details