బిహార్ బక్సర్‌లో ప్రభుత్వ అంబులెన్స్‌లకు కొత్త రంగు వేసి కొత్త వాటిలా పలుమార్లు ప్రారంభించటంపై ఈటీవీ భారత్ కథనం రాసింది. ఆ వార్త రాజకీయంగా దుమారం లేపటం వల్ల ఆగ్రహించిన భాజపా నేత పరశురామ్ చతుర్వేది.. ఈటీవీ భారత్ రిపోర్టర్‌పై ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 500,506,420, 34 సెక్షన్ల కింద జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
రిపోర్టర్ ఉమేశ్ పాండేపై చతుర్వేది తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే గౌరవానికి భంగం కలిగించారని, భాజపా ప్రతిష్ఠను దెబ్బతీశారని, బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
జరిగిందేమిటి?
కొత్త స్టిక్కర్లు అంటించిన.. 5 పాత అంబులెన్స్‌లను మే 15న కేంద్ర మంత్రి అశ్విని చౌబే వర్చువల్‌గా ప్రారంభించారని ఈటీవీ భారత్ కథనం ప్రచురించింది. అవే అంబులెన్స్‌లను ఇప్పటి వరకు నాలుగు సార్లు ప్రారంభించారని వెలుగులోకి వచ్చింది. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఇదే అంశంపై కేంద్ర మంత్రి చౌబేను సంప్రదించేందుకు రిపోర్టర్ ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదు.
ఇందులో ఉన్న మరో కొత్త ట్విస్ట్‌ను బహిర్గతం చేసింది ఈటీవీ భారత్. ఆ అంబులెన్స్‌లు కనీసం రవాణా శాఖ వద్ద రిజిస్టర్ కూడా చేయలేదని తెలిపింది. దీనిపై బక్సర్ జిల్లా రవాణా శాఖ అధికారి మనోజ్ రజాక్‌ను కలవగా.. బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లను 2020, ఆగస్టులో సుప్రీం కోర్టు నిషేధించిందని తెలిపారు. అందుకే వాటిని రిజిస్టర్ చేయలేదన్నారు. ఇలాంటి వాహనాలు ప్రమాదాలకు కారణమైతే వాటిని వినియోగించే వ్యక్తులు, సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆ వాహనాలు రోడ్లపైకి వస్తే సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
అయితే.. ఈటీవీ భారత్‌లో కథనం ప్రచురితమై రాజకీయంగా వివాదం రాజుకున్న క్రమంలో మాట మార్చారు రవాణా అధికారి. సాఫ్ట్వేర్ సమస్య వల్ల అంబులెన్స్‌లను రిజిస్టర్ చేయలేదని, ప్రస్తుతం ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.