Migrant Worker From Assam Returns Home: తన సొంత గ్రామానికి వెళ్లేందుకు.. వందల కిలోమీటర్లు నడిచిన వలసకూలీ కథ సుఖాంతమైంది. అసోంకు చెందిన వలస కూలీ అజయ్ బోడులే సుదీర్ఘ కాలం తర్వాత.. క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. తొలుత అసోం నుంచి హైదరాబాద్‌కు, మళ్లీ అక్కడి నుంచి ఒడిశా కోరాపుట్ జిల్లా లక్ష్మీపుర్కు వచ్చిన అజయ్ సంబంధిత కథనాలను ఈటీవీ భారత్ పలుమార్లు ప్రసారం చేసింది. ఇదే అతడిని ఇంటికి చేర్చేందుకు దోహదపడింది.
గువాహటికి చెందిన ఈటీవీ భారత్ జర్నలిస్ట్.. అజయ్ ఇంటికి వెళ్లి వాళ్ల కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. ఆ తర్వాత.. అసోంలోని యూనిసెఫ్ ఒడియా అధికారి లక్ష్మీ నారాయణ్ నందా, ఒడిశాలోని ఎయిడ్-ఎట్-యాక్షన్ స్టేట్ హెడ్, యువ సామాజిక కార్యకర్త ఉమీ డేనియల్ ద్వారా ఈటీవీ భారత్‌లో ప్రసారమైన అజయ్ సంబంధిత వార్తల గురించి అసోం ప్రభుత్వం తెలుసుకుంది.
వీరి సంయుక్త కృషితో ఇద్దరు అసోం పోలీసు అధికారులు.. డిసెంబర్ 11న లక్ష్మీపుర్ చేరుకున్నారు. అక్కడే రైల్వే సొరంగం పనుల్లో నిమగ్నమైన అజయ్‌ను గుర్తించారు. అతడిని ఓ రైలులో ఇంటికి పంపించారు.
650 కి.మీ. ప్రయాణం..
Migrant Workers Walking Home: ఉపాధి కోసం అసోం నాగావ్ నుంచి వందల కిలోమీటర్ల దూరంలోని హైదరాబాద్‌కు వచ్చాడు అజయ్. అక్కడ భవన నిర్మాణ పనుల్లో మేస్త్రీ మోసం చేయటం వల్ల.. చేతిలో చిల్లిగవ్వ లేక, తినేందుకు తిండి లేక కాలినడకన సొంత రాష్ట్రానికి పయనమయ్యాడు. మూడు నెలలుగా సుమారు 650 కిలోమీటర్లు నడిచాడు.
మార్గం మధ్యలో బిచ్చమెత్తుకుని కడుపు నింపుకునేవాడు అజయ్. ఏదీ దొరకని సమయంలో మంచి నీళ్లతో సరిపెట్టుకునేవాడు.