ప్రపంచవ్యాప్తంగా 2019లో 931 మిలియన్ టన్నుల ఆహారం వృథా అయిందని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్డీపీ) వెల్లడించింది. భారత్లో 68.7 మిలియన్ టన్నులు ఆహారం వ్యర్థమైనట్లు పేర్కొంది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం, తన భాగస్వామి సంస్థ డబ్ల్యూఆర్ఏపీ సహకారంతో ఈమేరకు ఆహార వ్యర్థ సూచీ- 2021ని తయారుచేసింది.
మొత్తం ఆహారోత్పత్తిలో 17 శాతం..
మొత్తం ఆహార వ్యర్థాలలో 61 శాతం వ్యర్థాలు గృహాల నుంచి కాగా..26 శాతం ఆహార సేవల నుంచి, 13 శాతం రిటైల్ రంగంలో వెలుగుచూసినట్లు యూఎన్డీపీ తన నివేదకలో పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం ఆహార ఉత్పత్తిలో 17 శాతం వ్యర్థమవుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ మొత్తం పూర్తిగా నింపిన 23 మిలియన్ల '40 టన్నుల ట్రక్కు'లకు సమానమని తెలిపింది. ఈ వ్యర్థాలతో భూమిని ఏడు సార్లు చుట్టిరాగలమని అభిప్రాయపడింది. ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి దేశం గణనీయమైన స్థాయిలో ఆహారాన్ని వృథా చేస్తున్నట్లు తెలిపింది.
ఇళ్లలోనే ఎక్కువ..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి వ్యక్తి 121 కేజీల ఆహారం వ్యర్థం చేస్తున్నట్లు యూఎన్డీపీ లెక్కగట్టింది. అందులో ఇళ్లలోనే 74 కేజీలు వృథా చేస్తున్నట్లు పేర్కొంది. మొత్తం ఆహార వ్యర్థాలలో 11 శాతం వినియోగదారుని వద్ద వ్యర్థమవుతుండగా.. 5 శాతం ఆహార సేవలలో, మరో 2 శాతం రిటైల్ విభాగంలో వ్యర్థాలు నమోదయ్యాయని తెలిపింది.