Escape Karthik Arrested : వంద కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ ఘరానా దొంగను కర్ణాటక పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఇళ్ల దొంగగా పేరుగాంచిన కార్తీక్ కుమార్ అలియాస్ ఎస్కేప్ కార్తీక్ను.. ఓ కేసు విషయంలో గోవాకు వెళ్లిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. జల్సాలకు బానిసైన కార్తీక్.. విలాసవంతమైన జీవితం కోసం ఇళ్లలో దొంగతనాలు చేయడం అలవాటుగా చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు వందకు పైగా ఇళ్లలో చోరీలు చేసినట్లు పేర్కొన్నారు.
కర్ణాటకలోని హెన్నూర్కు చెందిన కార్తీక్.. 16 ఏళ్ల వయసు నుంచే దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. జల్సాల కోసం ఇళ్లలో చోరీలకు పాల్పడటం అలవాటుగా మార్చుకున్నాడు. కార్తీక్కు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు కామాక్షిపాళ్య, హెన్నూరు, కొత్తనూరు, మైసూర్, హసన్ జిల్లాల్లో వందకు పైగా ఇళ్లలో చోరీలు చేశాడు. వివిధ కేసుల్లో బెంగళూరు పోలీసులు అతడిని ఇప్పటివరకు 20 సార్లు అరెస్టు చేశారు.
2008లో ఓ చోరీ కేసులో అరెస్టయ్యాడు కార్తీక్. ఆ సమయంలో పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో భోజనం పంపిణీ చేసేందుకు వచ్చిన వాహనంలో దాక్కుని పరారయ్యాడు. మళ్లీ 45 రోజుల తరువాత పోలీసులకు పట్టుబడ్డాడు. 2010లో మరోసారి పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని కొన్నిరోజుల తరువాత మళ్లీ దొరికాడు. దీంతో అతడికి ఎస్కేప్ కార్తీక్ అనే పేరు వచ్చింది. ఇలా చోరీ కేసులో అరెస్టు అవ్వడం.. జైలు లేదా పోలీసుల అదుపులో నుంచి తప్పించుకుని మళ్లీ దొంగతనాలకుపాల్పడటం అతడికి అలవాటుగా మారింది. అయితే కార్తీక్ను మరో కేసులో హెన్నూరు పోలీసులు గతేడాది నవంబర్లో అరెస్టు చేశారు. బెయిల్పై బయటకు వచ్చిన కార్తీక్ను.. ఓ కేసు విషయంలో గోవాకు వెళ్లిన గోవిందరాజనగర్ పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. కార్తీక్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు.