Floods Effect in Warangal 2023 :ఇంటి చుట్టూ నీరు.. వీధులన్నీ ఏరులే అన్నట్లుగా త్రినగరి పరిస్థితి మారింది. గ్రేటర్ వరంగల్‌లో 1200 కాలనీలు ఉండగా.. వరంగల్‌లో 150 కాలనీలు.. హనుమకొండ, ఖాజీపేటల్లో 50 కాలనీలు ఇంకా నీటి ముంపులోనే ఉన్నాయి. భారీ వర్షాలు, వరదలు.. కోలుకోలేని దెబ్బ తీశాయి. ఇప్పటికీ సంతోషిమాత కాలనీ 2, బృందావనీ కాలనీ, సాయినగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీలు.. జల దిగ్భందనంలోనే ఉన్నాయి. ఇక వరద తగ్గాక.. పునరావాస కేంద్రాల నుంచి వచ్చిన వారు.. ఇళ్ల పరిస్థితి చూసి ఆవేదన చెందుతున్నారు. కూలిపోయిన ఇళ్లు చూసి నోట మాట లేకుండా ఉంటున్న పరిస్థితి నెలకొంది. ఇళ్లలోని బియ్యం సహా నిత్యావసర సామగ్రి తడిసిపోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద తగ్గినా ఇంట్లో చేరిన బురదతో నగరవాసులు నానా అవస్థలు పడుతున్నారు.
Errabelli Dayakar Rao on Flood Damage Warangal :వరంగల్, హనుమకొండ పరిధిలో 680కి పైగా ఇళ్లు నేలకూలాయి. రహదారులు, కల్వర్టులు, కాల్వలు దెబ్బతినగా రూ.177 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. రెండు నగరాల్లోవరద నష్టం రూ.414 కోట్లుగా ప్రాథమికంగా అంచనా వేసినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. వరదల్లో మృతి చెందిన వారికి రూ.4 లక్షల పరిహారం అందించనున్నట్లు వెల్లడించారు. క్షతగాత్రులకు రూ.60 వేల నుంచి రూ.2 లక్షల వరకూ పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు.
గతంలో మంత్రి కేటీఆర్ వచ్చినప్పుడు నాలాలు కట్టడం వల్ల ఇబ్బంది జరిగిందని.. ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులు పెడితే కొన్ని తీసేశాం. నాలాలు ఇప్పుడు కాదు ఇచ్చింది.. ముప్పై, నలబై సంవత్సరాల కింద గత ప్రభుత్వాలు పర్మిషన్లు ఇచ్చాయి. కాగితాలు కూడా సృష్టించి తీసుకున్నారు. భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అంతా కూడా ఎంతగానో కష్టపడ్డారు. ప్రాణనష్టం లేకుండా వీలున్న కాడికి అందరినీ కాపాడగలిగాం. -ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి