ప్రతికూలతను అవకాశంగా మర్చుకునే విషయంలో మన నేతలది అందెవేసిన చెయ్యి. తమిళనాడు మఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి కూడా ఇందుకు మినహాయింపేం కాదు. రాష్ట్రంలో తుపాను కారణంగా కావేరీ డెల్టా ప్రాంతమైన కుడ్డలోర్ నుంచి నాగపట్టణం వరకు తీవ్ర పంటనష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల పొలాలు నీట మునిగాయి. ఈ ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన పళనిస్వామి వేషధారణ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తుపాను కారణంగా దెబ్బతిన్న పొలాలను సందర్శించే సమయంలో ఆయన దోతీని మడిచి, బురదను కూడా లెక్క చేయకుండా వ్యవసాయ క్షేత్రంలోకి దిగి రైతులతో నేరుగా మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తాను కూడా రైతుననే భావనను ప్రజల్లో కలగించేందుకే పళనిస్వామి ఈ ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అప్పుడలా..
రెండేళ్ల క్రితం తమిళనాడులో గజా తుపాను అల్లకల్లోలం సృష్టించింది. ఆ సమయంలో ప్రత్యేక చాపర్‌లో వెళ్లి డెల్టా ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను సందర్శించారు పళనిస్వామి. ఆయన తీరుపై అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.
ఇప్పుడు రైతు అవతారంపై కొద్ది నెలల క్రితం నుంచే దృష్టి సారించారు పళనిస్వామి. డీఎంకే పట్టణ నాయకత్వానికి ప్రత్యామ్నాయంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారు. ఓ టీవీ కార్యక్రమంలో వరి నాటుతూ కన్పించారు. పొలం మధ్యలో నిల్చొని ఓ చేత్తో కొడవలి మరో చేత్తో వరి పైరు పట్టుకుని అచ్చం రైతులా ఫోజులిచ్చారు. ఇదంతా జరిగింది ఆయన సొంత నియోజకవర్గం ఎడప్పాడిలోనే కావడం గమనార్హం. ఆ తర్వాత ఆయన ఆరోగ్య మంత్రి సీ విజయభాస్కర్‌తో కలిసి పుదుకొట్టాయ్ జిల్లాలో జల్లికట్టు పోటీలను కూడా ప్రారంభించారు.
అయితే పళనిస్వామి ఇవన్నీ రైతు ఇమేజ్ కోసమే చేస్తున్నారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. వీటిని ఏఐఏడీఎంకే ఖండించింది. రైతు కుటుంబం నుంచే వచ్చిన పళనిస్వామికి ఆ అవసరం లేదని పార్టీ ఐటీ వింగ్ స్పష్టం చేసింది.
ఇటీవల ఓ సందర్భంలో 'నేను స్వతహాగా రైతును. ప్రతిపక్ష డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌కు వ్యవసాయం గురించి ఏం తెలుసు?' అని పళనిస్వామి అన్నారు.
" ఆయన తన లాగే ఉన్నారు. ఇమేజ్ మార్చుకోవాల్సిన అవసరం సీఎం పళనిస్వామికి లేదు. వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చారు. ఇతర నేతల్లా ఆయన మూలాలను మర్చిపోయే వ్యక్తి కాదు. రైతుల పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఏఐఏడీఎంకే ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. పార్టీకి కచ్చితంగా వారు ఓటేస్తారు. వరద ప్రాంతాల్లో సీఎం పర్యటనను రాజకీయ కోణంలో చూడవద్దు"
-ఏఐఏడీఎంకే అధికార ప్రతినిధి శివశంకరి