కర్ణాటకలో ప్రముఖ పర్యావరణవేత్త, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాజ్యోత్సవ అవార్డు గ్రహీత సాలుమరద వీరాచారి.. ఆత్మహత్య చేసుకున్నారు. దావరణగెరె జిల్లా హరిహర్ మండలం మిట్లకట్టె గ్రామంలో తాను నాటి, పెంచిన చెట్టుకే మంగళవారం వేకువజామున ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. పేదలకు న్యాయం చేయడంలో విఫలమైతే ఉరికంబం ఎక్కుతానని గతంలోనే ప్రకటించిన వీరాచారి.. సోమవారం జరిగిన పరిణామంతో అన్నంత పని చేశారు.
ఎవరీ వీరాచారి? సోమవారం ఏమైంది?
వీరాచారి.. ప్రకృతి ప్రేమికుడు, సామాజిక కార్యకర్త. పేదల కోసం గళం వినిపించడంలో ముందుంటారు. దావణగెరె జిల్లాలో సొంత డబ్బులతో దాదాపు 3000 మొక్కలు నాటారు. అందుకే స్థానికులు ఆయన్ను సాలుమరద వీరాచారి అంటారు. కన్నడంలో సాలుమరద అంటే.. మొక్కల వరుస(హరితహారం తరహాలో) అని అర్థం.
దాదాపు 20 ఏళ్లుగా మిట్లకట్టె గ్రామంలోని రేషన్ దుకాణంలో అక్రమాలు జరుగుతున్నాయని పోరాడుతున్నారు వీరాచారి. రేషన్ షాప్ యజమాని సిద్ధరామప్ప.. ప్రజలకు నిత్యావసరాలు సరిగా పంచడం లేదని, ఏడాదికి 700 క్వింటాళ్ల మేర అక్రమాలకు పాల్పడుతున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై వీరాచారి అనేక ఫిర్యాదులు చేశారు. ఓసారి సిద్ధరామప్ప లైసెన్స్ రద్దు అయినా.. ఆయన పైరవీలతో తిరిగి పొందారని తెలిసింది. తర్వాత ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. అయితే.. సిద్ధరామప్ప రేషన్ షాప్ మూసేయకుండా న్యాయస్థానం స్టే ఇచ్చింది.