Budget Session 2023 : ప్రపంచ దేశాల్లో ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో భారత బడ్జెట్ సామాన్య పౌరుల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుందని, ప్రపంచానికి ఆశాకిరణంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన మోదీ.. సమావేశాల ప్రారంభంలోనే ఆర్థిక నిపుణుల నుంచి సానుకూల సందేశాలు వస్తున్నాయన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం సమర్పించనున్న బడ్జెట్.. ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చేలా.. ప్రపంచం భారతదేశంపై పెట్టుకున్న నమ్మకాన్ని కూడా పెంపొందిచేలా కృషి చేస్తుందని ప్రధాని అన్నారు.
"ఈ రోజు చాలా ముఖ్యమైనది. రాష్ట్రపతి మొదటిసారిగా పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగం భారత రాజ్యాంగానికి, భారత పార్లమెంటరీ వ్యవస్థకు, మహిళలకు గర్వకారణం. దేశంలోని గొప్ప గిరిజన సంప్రదాయాలను గౌరవించేందుకు ఇది ఒక అవకాశం " అని మోదీ అన్నారు.